హైదరాబాద్, ఆంధ్రప్రభ : కొత్త ఆలోచలకు శ్రీకారం – సరికొత్త ఆశయాలకు ప్రాకారంగా నిలిచే ఉగాది సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీపి కబురు అందించింది. తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని ఆ రోజున ప్రయాణీకులకు ప్రయోజనం చేకూర్చే విధంగా మరో మూడు రాయితీలు కల్పించనున్నట్లు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్‌లు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉగాది రోజున 65 ఏళ్లు పై ఉన్న వయోజనులకు బస్సుల్లో అంటే పల్లెవెలుగు నుంచి మల్టి యాక్సిల్ గరుడ ప్లస్ వరకు ఏ బస్సుల్లోనైనా ఉచితంగా ప్రయాణించ వచ్చని స్ఫష్టం చేశారు. తమ ఆధార్ లేదా వయస్సు ధృవీకరణ పత్రం ఏదైనా చూపించి ప్రయాణించవచ్చన్నారు. అలాగే కార్గో, పార్శల్ వినియోగదారులకూ మేలు చేకూర్చే నిర్ణయం కూడా తీసుకున్నారు. ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు ఐదు కిలోల బరువున్న పార్శల్స్ బుకింగ్ ఛార్జీలపై 25 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు వారు వెల్లడించారు. ఆ ప్రత్యేక రోజుల్లో ఈ రాయితీని ఎక్కడి నుంచి ఎంత దూరమైనా పంపించే పార్శల్ పై ఉపయోగించుకోవచ్చని చెప్పారు.
విమానాశ్రయానికి వెళ్లే పుష్ఫక్ బస్సులో అప్ అండ్ డౌన్ టిక్కెట్‌పై తిరుగు ప్రయాణంలో 20 శాతం రాయితీ కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. తిరుగు ప్రయాణాన్ని పది రోజుల్లోపు ఎప్పుడైనా వినియోగించుకోవచ్చని స్ఫష్టం చేశారు. ప్రయాణీకులకు మేరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ తగిన చర్యలు తీసుకుంటోందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..