Saturday, November 23, 2024

టీఎస్‌ఆర్టీసీ 5వేల కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదనలు.. జీహెచ్‌ఎంసికి ప్రత్యేక నిధుల కేటాయింపుపై ఆశలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.5 వేల కోట్లతో బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం. గత వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం టీఎస్‌ ఆర్టీసీకి రూ.3 వేల కోట్లు కేటాయించింది. ఇందులో ప్రణాళికా వ్యయం రూ.1500 కోట్లు కాగా, ప్రణాళికేతర వ్యయం రూ.1500 కోట్లుగా ఉంది. అయితే, ఈ ఏడాది రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ రూ.3 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలకు అనుగుణంగా రవాణా శాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆర్టీసీకి ఈ వార్షిక బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు సమర్పించినట్లు సమాచారం. అలాగే, సమస్యల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న గ్రేటర్‌ ఆర్టీసీకి ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయిస్తుందని ఆర్టీసీ వర్గాలు గంపెడాశతో ఉన్నాయి.

నష్టాలలో కొనసాగుతున్న గ్రేటర్‌ ఆర్టీసీని ఆదుకునేందుకు బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా ప్రకటిస్తున్నది. అయినప్పటికీ ఆచరణలో అమలులోకి రావడం లేదు. దీంతో ఈసారైన బడ్జెట్‌లో గ్రేటర్‌ ఆర్టీసీకి ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయిస్తుందేమోనని గ్రేటర్‌ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌ ఆర్టీసీని డొక్కు బస్సుల సమస్య పట్టి పీడిస్తున్నది. ఈ సారైనా బడ్జెట్లో గ్రేటర్‌ ఆర్టీసీకి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయిస్తే కొత్త బస్సులను కొనడం ద్వారా నగర ప్రయాణికులను ఆకర్శించడం ద్వారా ఎక్కువ ఆక్యుపెన్సీ రేటు (ఓఆర్‌) సాధించవచ్చని గ్రేటర్‌ ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, టీఎస్‌ ఆర్టీసీ వివాహాల సీజన్‌, పండుగలు వంటి ప్రత్యేక సందర్భాలలో ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి కొత్తగా 630 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.వీటిలో ఎక్కువగా సూపర్‌ లగ్జరీ బస్సులే ఉన్నాయి.

గత నెలలో 10 సూపర్‌ లగ్జరీ బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ప్రారంభించారు. కాగా, ప్రస్తుతం టీఎస్‌ ఆర్టీసీ రాష్ట్ర్రవ్యాప్తంగా 9190 బస్సులను నడుపుతుండగా, వాటిలో 6481 సంస్థకు చెందినది. మిగతా 2709 బస్సులను ప్రైవేటు వ్యక్తుల నుంచి అద్దెకు తీసుకుని వారికి నెల వారీగా కొంత మొత్తాన్ని చెల్లిస్తున్నారు. రాష్ట్ర్రవ్యాప్తంగా 3593 రూట్లలో ప్రతీ రోజూ ఆర్టీసీ 4 నుంచి 5 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుస్తున్నాయి. ఈ బస్సులు ప్రతీ రోజూ దాదాపుగా 31.96 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement