Monday, September 16, 2024

సంక్రాంతికి టీఎస్‌ ఆర్టీసీ 4233 ప్రత్యేక బస్సులు.. 60 రోజుల పాటు అడ్వాన్స్‌ సౌకర్యం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపనుంది. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 4233 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 585 సర్వీసులకు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించింది. వచ్చే ఏడాది జనవరి 7 నుంచి 15 వరకు ఈ ప్రత్యేక బస్సులను టీఎస్‌ ఆర్టీసీ నడపనుంది. ఈ మేరకు సంక్రాంతికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, ఇతర అంశాలపై టీఎస్‌ ఆర్టీసీ ఎండి విసి సజ్జన్నార్‌ శుక్రవారం బస్‌భవన్‌లో ఉన్నతాధికారులు, ఆర్‌ఎంలు, డీఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది 3736 బస్సులను నడపగా, ఈ సారి అంతకన్నా 10 శాతం అదనపు బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఏపీలోని అమలాపురం 125, కాకినాడ 117, కందుకూరు 83, విశాఖపట్నం 66, పోలవరం 51, రాజమండ్రికి 40 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. కాగా, సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం అడ్వాన్డ్స్‌ టికెట్‌ బుకింగ్‌ సౌకర్యాన్ని వినియోగించే వ్యవధిని 30 రోజుల నుంచి 60 రోజులకు పెంచినట్లు తెలిపారు. వచ్చే ఏడాది జూన్‌ వరకు అడ్వాన్స్డ్‌ బుకింగ్‌ సౌకర్యం అందుబాటులో ఉంటుందనీ, ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా సజ్జన్నార్‌ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement