హైదరాబాద్, ఆంధ్రప్రభ: టీఎస్‌పీఎస్‌సీ పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ కేసు మరో మలుపు తిరిగింది. పోలీసుల దర్యాప్తులో మరో కీలక విషయం బయట పడింది. టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, వెటర్నరీ అసి స్టెంట్ పరీక్ష ప్రశ్న పత్రాలు మాత్రమే కాకుండా మరో పేపర్ లీక్ అయింది. ఈనెల 5న జరిగిన అసిస్టెంట్ ఇంజ నీర్ (ఏఈ)పరీక్ష పేపర్ లీకైనట్లు పోలీసులు గుర్తించారు. పరీక్షకు రెండు రోజుల ముందే ప్రశ్నపత్రం లీకైనట్లు దర్యాప్తులో బయటపడింది. దీంతో అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షను టీఎస్‌పీఎస్‌సీ రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో తవ్వే కొద్దీ సంచలనాలు బయటకు వస్తునే ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు 9 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రధాన నిందితులు ఉద్యోగి ప్రవీణ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్‌తో పాటు పేపర్ లీకేజీ సూత్రధారి రేణుక, ఆమె భర్త, సోదరుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రశ్నాపత్రం కొను గోలు చేసిన ముగ్గురు అభ్యర్థులను సైతం అరెస్టు చేశారు. కాగా రేణుక హానీ ట్రాప్ తోనే ఇదంతా ప్రవీణ్ చేసినట్లు గుర్తించారు..ప్రవీణ్ ఫోన్ లో అనేకమంది యువతుల నెంబర్లు, ఫోటోలు ఉండటంతో పోలీసులు వారందర్ని విచారించే పనిలో పడ్డారు.. పలువురు యువతులతో ప్రవీణ్ కు వివాహేతర సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు..2017 నుంచి ఈ కార్యాలయం లో పని చేస్తున్న ప్రవీణ్ ఇప్పటి వరకు ఎన్ని పరీక్షల పేపర్ల ను లీక్ చేశాడనే అంశంపై ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు..
ఇంకా ఇందులో ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో పోలీ సులు దర్యాప్తు చేస్తున్నారు. పరీక్ష పత్రాల లీకేజీ వివరా లను పోలీసులు మీడియాకు వివరించారు. మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష పేపర్ లీక్ అయ్యిందంటూ ఈనెల 11న టీఎస్‌పీఎస్‌సీ నుంచి తమకు ఫిర్యాదు అందినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్న ప్రవీణ్ ప్రధాన నిందితుడుగా ఉన్నారని తెలిపారు. అతడితో కలిసి మరో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ కలిసి ప్రశ్నపత్రాలు లీక్ చేశారని వెల్లడించారు. కంప్యూటర్లలోని ప్రశ్నపత్రాలను ప్రవీణ్ తన పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసుకున్నాడని తెలిపారు. పాస్‌వర్డ్‌ను హ్యాక్ చేసి ఎగ్జామ్ పేపర్స్‌ను డౌన్‌లోడ్ చేశారన్నారు. వీరితో పాటు ఇటీవలే టీఎస్‌పీఎస్‌సీ పరీక్ష రాసి ఎంపికైన రేణుక అనే గురుకుల టీచర్ కూడా ఉన్నారని చెప్పారు. డౌన్‌లోడ్ చేసిన పేపర్స్‌ను రేణుక ఇంటికి తీసుకెళ్లిందని, ఓ పోలీస్ కానిస్టేబుల్ ద్వారా ఆ తర్వాత అభ్యర్థులైన గోపాల్ నాయక్, శ్రీను నాయక్‌లకు వాట్సాప్‌లో వాటిని పంపించినట్లు తెలిపారు. రేణుక భర్త కూడా డీఆర్‌డీఏలో టెక్నికల్ విభాగంలో పనిచేస్తాడని పోలీసులు వెల్లడించారు. ఏఈ పరీక్షకు సంబంధించి సివిల్ పేపర్ బయటికి వచ్చినట్లు తెలిపారు.
ఇంకెన్ని పేపర్లు లీకయ్యాయో ఇప్పుడే చెప్పలేం…
పేపర్ లీకేజీ వ్యవహారంలో రోజుకో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఈ కేసులో ఇంకా ఏమేం పేపర్లు లీక్ అయ్యాయో అని ఇప్పుడే చెప్పలేమని పోలీసులు చెబుతున్నారు. ఫోరెన్సిక్ రిపోర్టు తర్వాతే అది తెలుస్తుందన్నారు. అసలు వీరంతా కలిసి ఈ పని ఎందుకు చేశారన్న విషయం ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. గతంలోనూ వీరంతా కలిసి ఏమైనా అవకతవకలు చేశారా? అన్న కోణంలోనూ విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇద్దరు అభ్యర్థులకు రేణుక పేపర్ విక్రయించింది. దీని కోసం వారి నుంచి రూ.13.5 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకూ ఇంకా గ్రూప్-1 ప్రిలిమినరీ, డీఏవో, సీడీపీవో తదితర పోటీ పరీక్షలు జరిగాయి. అయితే తాజాగా అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష పేపర్ కూడా లీకైందని తేల్చడంతో టీఎస్‌పీఎస్‌సీ పరీక్షల వ్యవహారంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గ్రూప్-1 ప్రిలిమినరీపైనా అనుమానాలు?…
అసలు ఎన్ని పేపర్లు లీకయ్యాయో అనే దానిపైన అభ్యర్థుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రూప్-1 ప్రిలిమినరీ పేపర్ కూడా లీకై ఉంటుందనే అనుమానాలను అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ఎవరైతే ప్రధాన నిందితుడిగా ఉన్నారో ప్రవీణ్ తాను గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను రాశాడు. అయితే అతనికి 103 మార్కులు వచ్చినట్లుగా తెలుస్తోంది. పేపర్-1 జనరల్ స్టడీస్ 150 మార్కులకు గానూ ఆయనకు 103 మార్కులు రావడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ పేపర్‌ను కూడా ఏమైనా లీక్ చేశాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రవీణ్‌కు 103 మార్కులు వవ్చినప్పటికినీ మెయిన్స్‌కు మాత్రం క్వాలిఫై కాలేదని తెలిసింది. నెంబర్ బబ్లింగ్‌లో మిస్టేక్ చేయడం వల్ల అతను గ్రూప్-1 మెయిన్స్‌కు క్వాలిఫై కాలేదని విశ్వసనీయ సమాచారం.
ఒక్క పేపరే లీకైంది!…
మొత్తంగా అసలు ఎన్ని పేపర్లు లీకయ్యాయో స్పష్టతనే లేదు. పేపర్ లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్‌సీ అధికారులు మరోలా చెబుతున్నారు. ఈనెల 5న జరగాల్సిన అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్ ఒక్కటి మాత్రమే లీకైందని టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి ఆంధ్రప్రభతో తెలిపారు. ఈనెల 12న జరగాల్సిన టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష, 15, 16న జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష పేపర్‌లు లీక్ కాలేదని చెప్పారు. కేవలం అనుమానంతోనే వీటిని కూడా వాయిదా వేసినట్లు తెలిపారు. అయితే నిజనిజాలు పోలీసుల విచారణలో తేలనున్నాయని పేర్కొన్నారు.