హైదరాబాద్, ఆంధ్రప్రభ: గ్రూప్-2 పరీక్షా తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ప్రకటించింది. ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇవ్వాల (మంగళవారం) వెల్లడించింది. పరీక్షకు వారం ముందు నుంచి హాల్‌టికెట్లను అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వివరించింది. 783 పోస్టుల కోసం గతేడాది డిసెంబర్ 29న కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయగా, జనవరి 18 నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఈ ఉద్యోగాలకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ నెలకొంది.
ఇప్పటికే గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్-4 పరీక్ష తేదీలను ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ఖరారు చేసింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను జూన్ 5 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. గ్రూప్-4 పరీక్షలను జూలై 1న నిర్వహించనున్నారు. దీంతో గ్రూప్-2 పరీక్షలను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. మొత్తం 600 మార్కులకు గానూ జనరల్ స్టడీస్, ఎబిలిటీస్ మొదటి పేపర్‌గా, హిస్టరీ, పాలిటీ, సొసైటీ రెండో పేపర్‌గా ఉండనుంది.
ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ మూడో పేపర్, తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ నాలుగో పేపర్‌గా ఉంటాయి. గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్4, గ్రూప్-2 పరీక్షా తేదీలు ఖరారు కావడంతో ఇక మిగిలింది గ్రూప్-3 మాత్రమే. ఫిబ్రవరి 23 వరకు గ్రూప్-3 పోస్టుల దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది. అయితే గ్రూప్-1 జూన్‌లో ఉండడం, గ్రూప్-4 జూలైలో, గ్రూప్-2 ఆగస్టులో ఉండడంతో గ్రూప్-3 సెప్టెంబర్‌లో ఉండే అవకాశం కనిపిస్తోంది.