Tuesday, November 19, 2024

Big story | నిలిచి పోయిన పర్యాటకాభివృద్ది పనులు.. సమీక్షిస్తున్న టీఎస్‌ టీడీసీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వం మారిపోవడంతో వేలాదికోట్ల ప్రాజెక్టులు మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రాంతాల వారీగా పర్యాటక ప్రాజెక్టులను ప్రభుత్వం సమీక్షింస్తోంది. ఇందులో భారీగా కేంద్ర ప్రభుత్వం ప్రసాద్‌ టూరిజం డెవెలప్‌మెంట్‌ నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి మంజూరు చేయడంతో రామప్ప, భద్రాచలం, కర్ణమామిడి, టెంపుల్‌ టూరిజం అభివృద్ధి పనులు ప్రారంభమైనా నిలిచిపోయినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ సమీక్షలో వెలుగు చూసినట్లు సమాచారం.

వేల కోట్ల రూపాయలతో జరగాల్సిన పనులు అర్థంగా నిలిచిపోవడంతో రాష్ట్ర పర్యాటకాభివృద్ది శాఖ ప్రధానంగా నిర్మాణంలో ఉన్న పనులను కొనసాగించడంతో పాటుగా పనుల్లో వేగం పెంచాలని నిర్ణయించింది. అలాగే మిడ్‌ మానేరు కేబుల్‌ బ్రిడ్జ్‌, కాళేశ్వరం సర్క్యూట్‌ పర్యాటక రంగాభివృద్ధి పనులు, కొండపోచమ్మ రిజర్వాయర్‌ లో బోటింగ్‌ ఏర్పాటు పనులను సమీక్షిస్తోంది. ఈ అభివృద్ధి పనులకు ఇప్పటికే పరిపాలనా పరమైన అనుమతులతో పాటుగా బడ్జెట్‌ లో నిధుల కేటాయింపులు కూడా జరగడంతో పనుల్లో వేగం పెంచి అంతర్జాతీయ, జాతీయ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు సమాచారం.

అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జలాశయాల వద్ద మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఇప్పటికే నిధుల కేటాయింపులు ఉండటంతో పనుల్లో వేగం పెంచాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. మన్నెంకొండ అభివృద్ధికి పూర్తి స్థాయిలో నిధుల కేటాయింపులు, టెండర్ల ఖరారు అయినప్పటికీ కేబుల్‌ బ్రిడ్జి, రహదారుల నిర్మాణం జరగపోవడంతో పర్యాటక శాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టులో నిధుల గోల్‌ మాల్‌ జరిగినట్లు ప్రథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే 119 నియోజకవర్గాల్లోని చెరువులను ట్యాంక్‌ బండ్‌ స్థాయిలో సుందరీకరణ చేసేందుకు గతప్రభుత్వం నిధులు కేటాయించి కొన్ని చెరువులను సుందరీకరించినప్పటికీ సుమారు 80 శాతం పనులు కాలేదనే ఆలోచనతో పర్యాటక శాఖ సమీక్షలు చేస్తోంది.

- Advertisement -

అలాగే కేంద్ర ప్రభుత్వం టూరిజం అభివృద్ధి కోసం భువనగిరి కోట, ఆదిలాబాద్‌ లోని కవ్వాల్‌ అభయారణ్యం ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఒక్కో ప్రాజెక్టుకు రూ. 100కోట్లు స్వదేశ్‌ సందర్శన్‌ పథకం కింద కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గత బీఆర్‌ఎస్‌ కేంద్రం మంజూరు ఇచ్చినప్పటికీ పనులు జరగకపోవడంపట్ల రాష్ట్ర రాష్ట్ర పర్యాటకాభివృద్ధి శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు జరిగిన అభివృద్ది పనులు, జరగాల్సిన అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపులపై ప్రాజెెక్టుల వారీగా నివేదికలను రూపొందించి పనుల్లో వేగం పెంచడంతో పాటుగా క్రమశిక్షణ చర్యలకు కూడా ఉపక్రమిస్తున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement