హైదరాబాద్, ఆంధ్రప్రభ: దక్షిణ తెలంగాణకు జీవధారగా భాసిల్లనున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల్లో అంతర్భాగంగా నిర్మిస్తున్న ఏదుల రిజర్వాయర్ వెట్ రన్ కు సిద్ధమైంది. ప్రభుత్వం ఎప్పుడు సమయమిచ్చినా వెట్ రన్ నిర్వహించేందుకు ఇంజనీరింగ్ నిపుణులు రాత్రింభవళ్లు విధుల్లో నిమగ్నమయ్యారు. 6.5 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని దశలవారిగా ఎత్తిపోస్తారు. ఈ మేరకు 145 మెగావాట్లతో ఏర్పాటు చేసిన 4 పంపుల తో పాటుగా డిండీ నుంచి సరఫరా అయ్యే విద్యుత్ కోసం ప్రత్యేకంగా 400 కేవీ సబ్ స్టేషన్ పనులు పూర్తి అయ్యాయి.
నార్లాపూర్ నుంచి ఏదుల వరకు దట్టమైన అడవులు, అతిపెద్ద కొండలు ఉండటంతో ఇంజనీరింగ్ నిపుణులు కొండల కింది నుంచి భూగర్భంలో భారీ సొరంగాలు నిర్మించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఈ సొరంగం వైశల్యం 9.5మీటర్లు ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఏదులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. భూగర్భ సొరంగాలతో పాటుగా భూతలం నుంచి సుమారు 50 మీటర్ల లోతులో భారీ పంపు హౌజ్ నిర్మాణం కూడా పూర్తి అయినట్లు సమాచారం. ఈ భూగర్భ పంపు హౌజ్ లో 145 మెగావాట్ల 4 మోటర్ల బిగింపు శనివారం నాటికి పూర్తి అయ్యాయి.
అలాగే 15 మీటర్ల భూగర్భ సొరంగంతో పాటుగా భూ ఉపరితలం పై 8.3 కిలో మీటర్ల కెనాల్ నిర్మాణాన్ని ఇంజనీరింగ్ నిపుణులు పూర్తి చేశారు. అలాగే నార్లాపూర్ రిజర్వాయర్ లో ప్రస్తుతం 2టీఎంసీ నీటిని నిల్వచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే ఈ నీటిని ఏదులకు పంపింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు. కొండలను సరిహద్దులుగా చేసుకుని నిర్మించిన ఏదుల రిజర్వాయర్ దట్టమైన అడవిలో ప్రకృతిని మరింత పరవశింపచేస్తోంది. నార్లాపూర్ నుంచి ఏదులకు భూగర్భ సొరంగం నుంచి నల్లమల అడవుల కింది నుంచి వెళ్లడం ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా నిలుస్తోందని జలనిపుణులు భావిస్తున్నారు.
పెండింగ్ బిల్లులకు మోక్షం ఎప్పుడు
సుప్రసిద్ధ ఇంజనీరింగ్ నిర్మాణ సంస్థలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములయ్యాయి. రూ 32వేల 200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు పనులు దశలవారిగా జరుగుతున్నాయి. ప్రధానంగా నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన రిజర్వాయర్ల నిర్మాణానికి నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయల బిల్లులు చెల్లించి పనుల్లో వేగం పెంచినప్పటికీ సాంకేతిక కారణాలతో అంచనా వ్యాయాలు పెరిగినట్లు సమాచారం.
ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించినప్పుడు ఉన్న జీఎస్టీ పెరగడంతో అంచనాలు మారుతున్నట్లు తెలుస్తోంది. నిర్మాణ సంస్థలకు రూ. 3వేల 500 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఈ బిల్లుల చెల్లింపులు జరిగితే మిగతా ప్రాజెక్టుల నిర్మాణాల్లో వేగం పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పెండింగ్ బిల్లుల కోసం ప్రాజెక్టు నిర్మాణ సంస్థలు ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.