Sunday, November 24, 2024

జలపాతాల పరిసరాల్లో ఆదిమానవుని ఆవాసాలు.. పర్యాటక ప్రాంతాలుగా తీర్చి దిద్దేందుకు ప్రత్యేక డీపీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఆకాశం అంచులను తాకుతున్నట్లు భ్రమింపచేసే గిరిశిఖరాలనుంచి జాలువారుతున్న జలపాతాల ప్రకృతి అందాలకు పర్యాటకులు మంత్రముగ్దులవుతున్నారు. ప్రకృతి అందాలను చూసే మనసుండాలే కానీ ప్రతికణం ఓ అద్భుత చిత్రంలా కాన్వాసుపై ఒదిగి పోతోంది. తెలంగాణలోని జలపాతాలు సౌందర్యరూపాలుగా ప్రకృతి వర్ణలుగా పరవశిస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక జలపాతాల పరిసర ప్రాంతాల్లో పురాతన కట్టడాలు, అధ్యాత్మిక మందిరాలు ఉండటంతో రాష్ట్ర పర్యాటక శాఖ తెలంగాణ జలపాతాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చి దిద్దేందుకు పక్కాప్రణాళిక రూపొందిస్తోంది. కుంతల జలపాతాల పరిసరాల్లో కాకతీయులకాలం నాటి శివాలయం, సొరంగ మార్గాలు, ప్రాచీన శిథిల కట్టడాలుండటంతో పర్యాటకుల తాకిడి పెరుగుతోంది.

అలాగే ఇటీవల చత్తీగడ్‌, తెలంగాణ సరిహద్దుల్లోని దండకారణ్యంలో వెలుగుచూసున ముత్యాల ధారా జలపాతం దేశంలోని జలపాతాల్లో అత్యంత ఎత్తుజలపాతంగా నమోదు కావడంతో ఈ జలపాతాల పరిసరాల్లో ఆధిమానవులు జీవంచిన ఆధారాలుండటంతో చరిత్ర కారులు పరిశోధనలు చేస్తున్నారు. ఇకరాష్ట్రంలోని జలపాతాలవివరాల్లోకి వెళ్లితే ప్రకృతి అందాలు కనులముందు కదలాడుతుంటాయి. ఆదిలాబాద్‌ జిల్లాలోని కుంతల జలపాతం 200 అడుగుల ఎత్తులోంచి జాలువారుతుంది. సహ్యాది పర్వత శ్రేణుల మధ్యలో ఉన్న ఈ జలపాతం కడెం నదీ జలాలతో అలరాలుతోంది. ములుగు నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొగత జలపాతం పరిసరాల్లో కాకతీయుల కాలం నాటి శిథిల కట్టడాలుండటంతో చరిత్ర పరిశోధకులను, పర్యాటకులను ఆకట్టుకుంటుంది.

భీముని పాదం జలపాతం మహబూబాబాద్‌ జిల్లోని దట్టమైన అడవిలో ఉంది. ఇక్కడ యాదవరాజుల ఆనవాళ్లు అగుపిస్తాయి. నల్లమల అడవుల్లోని మల్లెల తీర్థం జలపాతం సుప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం గాను, పర్యాటకప్రాంతంగాను బహుళ ప్రచారంలో ఉంది. ఈ ప్రాంతానికి చేరుకునేందుకు సుమారు రూ. 50 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. తెలంగాణలోని లోతైన జలపాతాల్లో పోచ్చర జలపాతం ప్రసిద్ధి చెందింది. ఈ జలపాతం జాలువారే ప్రాంతంలో సుమారు 800 మీటర్ల లోతు ఉండటంతో పరిసరాలకు పర్యాటకులను ప్రభుత్వం అనుమతించడంలేదు. ఈ నేపథ్యంలో జలాపాతాల అందాలను ద్విగుణీ కృతం చేసేందుకు పర్యాటక శాఖ డీపీఆర్‌ ను రూపొందించి కేంద్రానికి సమర్పించినా ఇప్పటి వరకు ఫలితాలు రాలేదు.

- Advertisement -

దేవాలయాల పరిసరాల్లోంచి జాలువారే సప్తకుండ్‌ జలపాతం గోదావరి ఉపనది పెంగంగా నదిపై ఉండటంతో తెలంగాణ, మహారాష్ట్ర పర్యాటకుల తాకిడి అధికంగా ఉంది. ఆదిలాబాద్‌ లో మరో అద్భుతం కనకాయి జలపాతం బంద్రేవ్‌ జలపాతం, చీకటి గుండం జలపాతం సంగమంతో జాలువారే ఈ జలపాతం ప్రాంతం ట్రెక్కింగ్‌ కు అనుకూలంగా ఉండటంతో రాష్ట్ర క్రీడా శాఖ ఈ జలపాతం పరిసరాల అభివృద్ధి పై దృష్టి సారించింది. ఈ జలపాతం 100 అడుగుల వెడల్పుతో 30 అడుగుల ఎత్తు తో కడెం ప్రవాహానికి అనుసంధానంగా ఉంది. ఈ ప్రాంతం దట్టమైన వృక్ష సంపదతో పాటు ప్రాచీన మానవుని పదునైన రాతి నిర్మాణాలతో అగుపుస్తోంది. దండకారణ్యంలో సాహస ప్రయాణం చేస్తే కానీ ఈ జలపాతం దరికి చేరుకునే అవకాశాలున్నాయి.

మహబూబ్‌ నగర్‌ లోని గుండాల జలపాతం, పెద్దపల్లిలోని గౌరి గుండం జలపాతం, నిజామాబాద్‌ లోని సిర్నాపల్లి జలపాతం, కరీంనగర్‌ లోని రాయికల్‌ జలపాతం, రామగుండం మండలంలోని రామనుని గుండం జలపాతం, భూపాలపల్లిలోని గాధల జలపాతం, నేరడి గొండలోని కార్డికల్‌ జలపాతం, రంగారెడ్డి జిల్లాలోని బోడకొండ జలపాతం, జహీరా బాద్‌ లోని జాడి జలపాతం ఆసిఫాబాద్‌ జిల్లాలోని సముతుల జలపాతం, మిట్టె జలపాతం, మదార జలపాతం, బాబేఘురు జలపాతం, పెద్దగుండం జలపాతం,ముక్తి గుండం జలపాతం, రథం దిబ్బెజలపాతాలు తెలంగాణ ప్రకృతి అందాలకు నగిషీలు దిద్దుతున్నాయి.

అయితే ఈ జలపాతాలను పర్యాటకులు సందర్శించేందుకు పర్యాటక శాఖ రోడ్లు, హోటళ్లు, బస, వసతులు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. ఛత్తీస్‌ గడ్‌, భూపాలపల్లి సరిహద్దుల్లోని దండకారణ్యంలో ఉన్న రహస్య జలపాతాన్ని ఇటీవల బిహిర్గతం అయింది. ఈ జలపాతాన్ని ముత్యాలధార, వీరభద్రం, గద్దెలసరి జలపాతంగా వ్యవహరిస్తారు, కొండల మధ్యనుంచి 750 అడుగుల ఎత్తులోంచి జాలువారే ఈ జలపాత ప్రాంతం కొద్ది కాలం క్రితం నిషిద్ధ ప్రాంతంగా ఉండేది. ఇక్కడ పీపుల్స్‌ వార్‌ క్యాంపులతో పాటుగా పోలీసు క్యాంపులు కూడా ఉండేవని తెలుస్తోంది. ఈ పరిసరాల్లో చరిత్ర ప్రాధాన్యత అంశాలు అనేకం ఉన్నాయి.

ముత్యాల జలపాతం దగ్గర 30వేల సంవత్సరాల ఆనవాళ్లు…

గద్దలసరి జలపాతం పరిసరాల్లో 30వేల సంవత్సరాల నాటి ఎగువ పాతరాతి యుగం మానవుని ఆనవాళ్లు ఉన్నట్లు సుప్రసిద్ధ చరిత్ర కారుడు, తెలుగు విశ్వవిద్యాలంయం కీర్తి పురష్కార గ్రహీత ద్వావనపల్లి సత్యనారాయణ చెప్పారు. ఇక్కడ జరిపిన చరిత్ర పరిశోధనలో నాటి ఆదిమానవుల బృందాలకు నాయకుడు ఉన్నట్లు ఇక్కడ పెద్దబండరాళ్లతో నిర్మించిన గుహ ఉందని తెలిపారు. అలాగే వేసవిలోనీటి కోసం ఈ జలపాతం ప్రవాహం దక్షిణం నుంచి పడమటివరకు పారే ప్రాంతంలో నీటి కట్టవేసిన ఆనవాళ్లు కూడా ఉన్నాయని తెలిపారు.

ఎగువపాతరాతి యుగంలో ఆదిమానవులు బ్లేడ్స్‌ ఉపయోగించేవారని, ఈ రాతి పెచ్చు ఆయుధాలు ఇక్కడ లభించాయని తెలిపారు. అలాగే మధ్యపాతరాతి యుగం నాటి ప్లేట్స్‌ కార్న్‌ రాతి పెచ్చు ఆయుధాలు కూడా ఇక్కడే లభించాయని తెలిపారు. తెలంగాణలోని భూభాగంలో అత్యంత ప్రాచీన మానవులు ఈ జలపాత ప్రాంతంలో జీవించినట్లు లభించిన చరిత్ర ప్రపంచంలోని అతిప్రాచీన మావుడు సంచరించిన ప్రాంతాలతో సమానమని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement