Friday, November 15, 2024

డీజిల్‌ వ్యయం భారం నుంచి గట్టెక్కనున్న టీఎస్‌ ఆర్టీసీ.. ఎలక్ట్రిక్‌గా మారనున్న బస్సులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పెరుగుతున్న డీజిల్‌ వ్యయ భారం నుంచి గట్టెక్కేందుకు టీఎస్‌ ఆర్టీసీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. టీఎస్‌ ఆర్టీసీ నిర్వహణలో ఉన్న డీజిల్‌ బస్సులను ఎలక్ట్రిక్‌గా మార్చేందుకు సంస్థ యాజ మాన్యం చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఇందులో భాగంగా ఎన్టీపీసీతో కలసి సంయుక్త ప్రాజెకుకు శ్రీకారం చుట్టనుంది. ప్రయోగాత్మకంగా మొదటి దశలో హైదరాబాద్‌లో నడుస్తున్న 100 డీజిల్‌ బస్సులను ఎలక్ట్రిక్‌గా మార్చనున్నారు. మరో రెండు మూడు నెలల్లో ఇవి పొగలేని కాలుష్య రహిత వాహనాలుగా రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. దేశవ్యాప్తంగా కాలుష్యం తగ్గించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం డీజిల్‌ బస్సులను ఎలక్ట్రిక్‌గా మార్చేందుకు కేంద్రం బృహత్‌ ప్రణాళికను సిద్ధం చేసింది.

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్యను పెంచే క్రమంలో కేంద్రం ఈ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కన్వర్షన్‌ కిట్‌ కోసం ఒక్కో బస్సుకు రూ.20 లక్షలు అందజేయడంతో పాటు కిట్‌ సరఫరాలకు ఏర్పాట్లను కూడా చేస్తుంది. ఎన్టీపీసీ రూ.40 లక్షల విలువైన బ్యాటరీని సరఫరా చేయనుంది. ఇందుకోసం బ్యాటరీ తయారీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఆర్టీసీకి నయా పైసా ఖర్చు లేకుండానే ఒక్కో బస్సుకు రూ.60 లక్షల విలువైన పరికరాలు అందనున్నాయి. అయితే, ఎలక్ట్రిక్‌ బస్సులుగా కన్వర్ట్‌ అయిన బస్సులను ఆర్టీసీనే నడపనుంది. టికెట్ల రూపంలో వచ్చే ఆదాయం ఆర్టీసీకే లభిస్తుంది. అయితే, ఎలక్ట్రిక్‌ బస్సులకు సంబంధించిన చార్జింగ్‌ ఏర్పాట్లను ఆర్టీసీ సొంతంగా చేసుకోవాల్సి ఉంటుంది.

- Advertisement -

కాగా, ప్రస్తుతం టీఎస్‌ ఆర్టీసీలో దాదాపు 3 వేలకు పైగా అద్దె బస్సులున్నాయి. త్వరలో 300 ఎలక్ట్రిక్‌ బస్సులు, 10 డబుల్‌ డెక్కర్‌ బస్సులు, కొన్ని స్లీపర్‌ బస్సులను ఆర్టీసీ అద్దెకు తీసుకోనుంది. వాటిని చెల్లిస్తున్నట్లుగానే కన్వర్షన్‌ బస్సులకు కూడా అద్దె చెల్లిస్తుంది. మరోవైపు, డీజిల్‌ బస్సులు ఎలక్ట్రిక్‌గా మారితే టీఎస్‌ ఆర్టీసీ భారీగా వ్యయం తగ్గనుంది. సాధారణంగా ఒక డీజిల్‌ బస్సుకు కి.మీ.కు రూ.20 వరకు నిర్వహణ వ్యయం అవుతుంది. అదే బ్యాటరీ బస్సును కేవలం రూ.6తోనే నడిపించవచ్చు. కేంద్ర ప్రాజెక్టు వల్ల ఆర్టీసీకి కన్వర్షన్‌ భారం లేనందున వీలైనన్ని ఎక్కువ బస్సులను ఎలక్ట్రిక్‌గా మార్చుకునే వెసులుబాటు కలుగుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement