Friday, November 22, 2024

ఎఫ్‌ 24 టికెట్లు విడుదల చేసిన టీఎస్‌ ఆర్టీసీ.. భారీ ఆదాయంపై ఆశలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వినూత్న పథకాలతో ప్రయాణికులను ఆకర్శిస్తున్న టీఎస్‌ ఆర్టీసీ మరో కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. రూ.300 చెల్లిస్తే రోజంతా నలుగురు ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. అలాగే, మహిళలు, సీనియర్‌ సిటిజన్ల కోసం టి6 టికెట్‌, కుటుంబ సభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం ఎఫ్‌-24 టికెట్లను ప్రవేశపెట్టింది. ఈ టికెట్లను శనివారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మహిళలు, సీనియర్‌ సిటిజన్ల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన టి-6 టికెట్‌ను కొనుగోలు చేయడం ద్వారా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని సిటీ, ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో 6 గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే వీలుంది.

అయితే, ఈ టికెట్‌ కొనుగోలు సమయంలో వృద్ధులు తమ వయసు ధృవీకరణ కోసం ఆధార్‌ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, వారాంతాలు, సెలవు దినాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు కలసి ప్రయాణించేందుకు వీలుగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఫ్యామిలీ టికెట్‌కు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో నలుగురు కలసి రోజంతా సిటీ, ఆర్డినరీ, మెట్రో బస్సులలో ప్రయాణించొచ్చు.

Affordable Travel in Hyderabad by TSRTC Special Offer | INDToday

- Advertisement -

అయితే, శని, ఆదివారాలతో పాటు సెలవు దినాల్లో మాత్రమే ఈ ఆఫర్‌ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. కాగా, గతంలో ఇదే తరహాలో టీఎస్‌ ఆర్టీసీ ప్రవేశపెట్టిన టి-24 టికెట్లను ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది. ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు 33.38 కోట్ల మంది ప్రయాణికులు ఈ టికెట్లను కొనుగోలు చేసినట్లు టీఎస్‌ ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.

ప్రస్తుతం ప్రతీ రోజు సగటున 25 వేల వరకు ఆ టికెట్లు అమ్ముడుపోతున్నాయి. దీంతో సంస్థకు ప్రతీ రోజూ లక్షల రూపాయల మేర ఆదాయం సమకూరుతున్నది. తాజాగా, టీఎస్‌ ఆర్టీసీ శనివారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చిన టి 6, ఎఫ్‌ 24, టికెట్లకు కూడా ప్రయాణికులు ఆదరిస్తారనీ, దీంతో సంస్థకు భారీగా ఆదాయం సమకూరుతుందని టీఎస్‌ ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement