Friday, November 22, 2024

పుణ్య‌క్షేత్రాల ద‌ర్శ‌నానికి టీఎస్ ఆర్టీసీ ప్యాకేజీ..

కార్తీక మాసం వ‌చ్చిందంటే చాలు పుణ్య‌క్షేత్రాలు భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతాయి. భ‌క్తులు శైవ‌క్షేత్రాల ద‌ర్శ‌నాకి ఈ మాసంలోనే ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తారు. పుణ్య‌క్షేత్రాలు ద‌ర్శించుకునే భ‌క్తుల‌కోసం ఆర్టీసీ ప్ర‌యోగాత్మ‌కంగా ప్ర‌త్యేక ప్యాకేజీతో ముందుకొచ్చింది. పుణ్య‌క్షేత్రానికి తీసుకెళ్లి.. మ‌ళ్లీ సుర‌క్షితంగా తిరిగి గ‌మ్య‌స్థానానికి చేర్చాల‌ని నిర్ణ‌యించింది. కార్తీక మాస దర్శిని ప్యాకేజీ-2 పేరుతో తీసుకొచ్చిన ఈ ప్యాకేజీలో అలియాబాద్, వర్గల్, కొమురవెల్లి, కీసర, చేర్యాల ఆలయాలను దర్శించుకోవచ్చని తెలిపింది. ఈ ప్యాకేజీ కింద పెద్దలకు రూ.500, పిల్లలకు రూ.300 వసూలు చేయనున్నట్లు వెల్లడించింది. సికింద్రాబాద్ గురుద్వారా వద్ద ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ యాత్ర.. తిరిగి రాత్రికి సికింద్రాబాద్ లోనే ముగుస్తుంది. ఫుడ్, టీ, టిఫిన్స్ మొత్తం ప్ర‌యాణికులే భ‌రించాల్సి ఉంటుంద‌ని తెలిపింది.

వేములవాడ, కాళేశ్వరం, రామప్పగుడి, వేయిస్తంభాల గుడిని దర్శించుకోవాల‌నుకునేవారికి ఆర్టీసీ ప్ర‌త్యేక ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. టికెట్‌ చార్జీ లగ్జరీ బస్సులో ఒక్కరికి రూ.1,500 ఉంటుంది. ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ దక్కన్‌ పంచశైవ క్షేత్రాలు, పంచారామాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజినల్‌ మేనేజర్‌ శ్రీధర్‌ తెలిపారు. ప్రతి ఆదివారం, కార్తీక పౌర్ణమి ముందు రోజు మధ్యాహ్నం 2 గంటలకు బస్సులు హైదరాబాద్‌ నుంచి బయల్ధేరి దర్శనానంతరం సోమవారం రాత్రి తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటాయని ఆయన వివరించారు. అలాగే ఏపీలోని అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట క్షేత్రాలకు వెళ్లేందుకు సూపర్‌ లగ్జరీ బస్సులో ఒక్కరికి టికెట్‌ ధర రూ.2,540 ఉంటుందని తెలిపారు. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌స్టేషన్‌, జంటనగరాల్లోని ఏటీబీ ఏజెంట్ల వద్ద, ఆన్‌లైన్‌ ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement