హైదరాబాద్, ఆంధ్రప్రభ : నష్టాల బాట నుంచి టీఎస్ ఆర్టీసీ క్రమంగా గట్టెక్కుతోంది. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్న సంస్థ యాజమాన్యం ఇప్పుడు లాభాల దిశగా పయనిస్తోంది. గత నెలలో టీఎస్ ఆర్టీసీ రోజువారీ సగటు ఆదాయం రూ.11.50 ఉండగా ఈ నెలలో గత వారం రోజుల సగటు రూ.15.50 కోట్లుగా నమోదవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తొలిసారిగా 45 డిపోలు లాభాలను నమోదు చేసుకున్నాయి. షాద్‌నగర్, తొర్రూరు, ఆదిలాబాద్, తాండూరు, అచ్చంపేట, జనగామ, వేములవాడ, మహేశ్వరం, మెట్‌పల్లి, బీహెచ్‌ఈఎల్, మధిర, నాగర్‌కర్నూలు, కొల్లాపూర్, నార్కెట్‌పల్లి, కల్వకుర్తి, సూర్యాపేట, జగిత్యాల, సిద్దిపేట, పరిగి, నారాయణపేట, సిరిసిల్ల, కొత్తగూడెం, మణుగూరు, గద్వాల, భద్రాచలం, నల్లగొండ, సత్తుపల్లి, కోదాడ, దేవరకొండ, వరంగల్-1, పికెట్, యాదగిరిగుట్ట, మిర్యాలగూడ, మహబూబ్‌నగర్, ఖమ్మం, వనపర్తి, హైదరాబాద్-1, మియాపూర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, నారాయణఖేడ్ తదితర డిపోలు ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేని ఆదాయాన్ని పొందుతూ లాభాల దశకు చేరుకోవడం విశేషం.
కాగా, రాష్ట్ర్రంలో మొత్తంగా 96 డిపోలు ఉండగా, 45 డిపోలు లాభాలు నమోదు చేసుకున్నాయి. మిగతా 51 డిపోలు కూడా త్వరలోనే లాభాల బాటలో పయనిస్తాయని ఆర్టీసీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) 74 శాతంగా నమోదైనట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. గతంలో అత్యధికంగా 61 శాతం ఓఆర్ నమోదు కాగా, ప్రస్తుతం అది 74గా నమోదు కావడం విశేషం. మరోవైపు, ఏప్రిల్ నెలలోనే పాఠశాలలు, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో పాటు శుభ ముహూర్తాలు లేకపోవడంతో ఓఆర్‌తో పాటు ఆర్టీసీ ఆదాయం కూడా గణనీయంగా పడిపోయింది. మే 1 నుంచి వివాహాల సీజన్ ప్రారంభం కావడంతో స్పెషల్ బస్సులు బుక్ చేసుకునే వారి సంఖ్య పెరగడంతో పాటు బంధువుల ప్రయాణాలు కూడా పెరిగాయి.
దీంతో మే 1 నుంచి ఆర్టీసీకి ఆదాయం గణనీయంగా పెరిగింది. దీంతో ఆర్టీసీకి ఆదాయం కూడా భారీ స్థాయిలో పెరిగింది. అయితే, శుభ ముహూర్తాలు కొనసాగినన్ని రోజులు ఆర్టీసీ ఆదాయానికి ఢోకా లేదనీ, రానున్న వానాకాలంలో ఓఆర్ పడిపోకుండా చూడాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి తెలంగాణ రాష్ట్ర్రంగా ఏర్పడిన కొద్ది రోజులకే వేతన సవరణ కోసం ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది సుదీర్థ సమ్మెకు దిగారు. దీంతో ప్రభుత్వం 44 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ చేపట్టింది. అనంతరం ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఫలితంగా ఆర్టీసీ పనితీరు దిగజారింది. టీఎస్ ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్, ఎండిగా సజ్జన్నార్ బాధ్యతలు తీసుకుని సంస్థను లాభాల బాటలో ముందుకు తీసుకెళుతున్నారు.