హైదరాబాద్, ఆంధ్రప్రభ: అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలనే భక్తులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. గురుపౌర్ణమి సందర్భంగా జూలై 3న అరుణాచలంలో జరిగే గిరిప్రదర్శనకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడపాలని అధికారులు నిర్ణయించారు. ఈమేరకు ప్యాకేజీ వివరాలను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఆదివారం వెల్లడించారు. జూలై 2న ఉదయం 6 గంటలకు హైదరాబాద్లోని ఎంజీబీఎస్ నుంచి ప్రత్యేక బస్సు బయల్దేరనుందని తెలిపారు.
ముందుగా ఆంధ్రప్రదేశ్ కాణిపాకంలోని విఘ్నేశ్వరుని దర్శనం అనంతరం అదే రోజు రాత్రి 10 గంటలకు అరుణాచలం చేరుకుంటుందన్నారు. గిరి ప్రదర్శన పూర్తయిన తర్వాత జూలై 3న సాయంత్రం 3 గంటలకు వెళ్లూరులోని గోల్డెన్ టెంపుల్కు వెళ్తుంది. అక్కడ దర్శనం అనంతరం మరుసటి రోజు జూలై 4న ఉదయం 10 గంటలకు హైదరాబాద్కు బస్సు చేరుకుంటుందని పేర్కొన్నారు. ఒక్కొక్కరికి రూ.2600గా ప్యాకేజీ ధరను నిర్ణయించారు. ఆసక్తి ఉన్న ప్రయాణికులు ఆర్టీసీ అధికారిక వెబ్సైట్లో రిజర్వేషన్ చేసుకోవచ్చని సూచించారు