ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్) – కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గ్రాండ్ వెల్ కమ్ చెప్పమన్నారు. ఈనెల 4న ఆదిలాబాద్, 5న సంగారెడ్డిలో ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మహారాష్ట్ర నాందేడ్ నుండి ఆదిలాబాద్‌కు హెలికాప్టర్లో వస్తున్న నేపథ్యంలో సీఎం హోదాలో తొలిసారి రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతించనున్నారు. ఇందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లపై శుక్రవారం దృష్టిసారించి సమీక్ష నిర్వహించారు.
ప్రధానికి, ముఖ్యమంత్రికి పటిష్టమైన బందోబస్తు, భద్రతా చర్యల గురించి రివ్యూ చేశారు. ఆదిలాబాద్ విమానాశ్రయ స్థలంలో మూడు హెలి ప్యాడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అదిలాబాద్ జిల్లా సమస్యలైన మూతపడ్డ సిమెంట్ ఫ్యాక్టరీ, ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ రైల్వే లైన్, ఆదిలాబాద్ లో ఏవియేషన్ అకాడమీ ఏర్పాటు తదితర ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రి ప్రస్తావించే అవకాశం ఉంది.