Sunday, November 24, 2024

TS | కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఖతం : మోదీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఆపార్టీ ఎస్సీఎస్టీబీసీల రిజర్వేషన్లను దొంగిలించి వాటిని మొత్తానికి మొత్తంగా ముస్లింలకు ఇస్తుంది. ప్రధానంగా బీసీల రిజర్వేషన్లను రద్దు చేసి ముస్లింలకు ఇస్తుంది. మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీసీలకు జరిగిన నష్టం మనం అందరం చూశాం. బీసీలకు హక్కుగా రావాల్సిన కార్పోరేటర్ల సీట్లు మెజారిటీ ముస్లింలకే దక్కాయి.

ఇప్పుడు తెలంగాణ, జీహెచ్‌ఎంసీ తరహా మోడల్‌నే కాంగ్రెస్‌ దేశ వ్యాప్తంగా అమలు చేయాలని చూస్తోంది. అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తోందని, అందులో ఒక ఆర్‌ తెలంగాణకు చెందిన వ్యక్తి అయితే మరో ఆర్‌ ఢిల్లికి చెందిన వ్యక్తి అని, వీరిద్దరు కలిసి హైదరాబాద్‌ను , తెలంగాణను కాంగ్రెస్‌కు ఏటీఎంగా మార్చారని విమర్శించారు.

హైదరాబాద్‌కు వచ్చేసరికి ఆర్‌ఆర్‌కు తోడు మరో రజాకార్‌ ఆర్‌ కూడా ఉందన్నారు. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ విషయంలో తాను ఎవరి పేరు చెప్పకున్నా… సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారంటే ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తోంది ఎవరో తెలుసుకోవచ్చన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు ప్రజల సమస్యలు పట్టవని, ప్రజల ఆరోగ్యం, విద్య, పేదల ఇబ్బందులు పట్టవన్నారు.

ఓటు బ్యాంకు రాజకీయ ప్రయోజనాల కోసం హైదరాబాద్‌ను కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఎంఐఎంకు రాసిచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఎంఐఎం గెలుపు కోసం బలమైన అభ్యర్థులను కూడా నిలబెట్టలేదని విమర్శించారు. ఈ మేరకు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్‌స్టేడీయంలో బీజేపీ నిర్వహించిన జనసభలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది…

- Advertisement -

తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ప్రకటించారు. తెలంగాణకు మొదటి ఆలిండియా మెడికల్‌ ఇనిస్ట్యూట్‌ను , 4 వందే భారత్‌ రైళ్లను, ట్రైబల్‌ యూనివర్సిటీని, మూతపడిన ఫర్టిలైజర్‌ కర్మాగారాన్ని తెరిపించింది, పసుపు బోర్డు ఏర్పాటు… ఇవన్నీ చేసింది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఏవియేషన్‌ హబ్‌గా మార్చడంతోపాటు రక్షణ రంగం మొదలు బయో టెక్నాలజీ, గ్రీన్‌ ఎనర్జీ, ఏఐ వరకు తెలంగాణను గ్లోబల్‌ పవర్‌ హబ్‌గా మారుస్తామని ప్రకటించారు.

కాంగ్రెస్‌ సామాన్యుల వ్యతిరేక పార్టీ అని, ఆ పార్టీ సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో పేద, సామాన్యుల సంక్షేమం కోసం ఉద్దేశించిన ఒక్క హామీ కూడా లేదని విమర్శించారు. ఓటు బ్యాంకు , అవినీతికి ఊతమిచ్చే హామీలు మాత్రమే కాంగ్రెస్‌ సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నాయని విమర్శించారు. ప్రజలు కష్టపడి సంపాదించిన ఆస్థిపై వారి వారసులకు హక్కు లేకుండా చేయాలన్నది కాంగ్రెస్‌ లక్ష్యమన్నారు. కాంగ్రెస్‌ నరనరాన రేసీజమ్‌ ఉందని, దక్షిణాది ప్రజలను ఆఫ్రీకన్లతో పోలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని ముక్కలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వెళుతోందని స్పష్టం చేశారు.

దేశాన్ని లూటీ చేయడమే కాంగ్రెస్‌ ట్రాక్‌ రికార్డు…

గడిచిన పదేళ్లలో దేశాన్ని ప్రపంచంలోనే అయిదవ ఆర్థికశక్తిగా , డిజిటల్‌ దేశంగా అభివృద్ధి చేయడంతోపాటు పేదల అభివృద్ధి, సంక్షేమానికి అండగా నిలబడడం, అంతరిక్షంలోనూ స్పేస్‌పవర్‌గా దేశాన్ని నిలపడం మోదీ ట్రాక్‌ రికార్డు అయితే… దేశాన్ని లూటీ చేయడం, కుటుంబ పాలనకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం, ఓటు బ్యాంకు, సంతుష్టీకరణ రాజకీయాలు చేయడం, ఉగ్రవాదులకు అండగా నిలబడడం, దేశాన్ని ముక్కలు, ముక్కులుగా చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్లడం కాంగ్రెస్‌ పార్టీ ట్రాక్‌ రికార్డు అని చెప్పారు.

ఈ నేపథ్యంలో ఓటర్లు, మరీముఖ్యంగా తొలిసారిగా ఓటు వేసే కొత్త ఓటర్లు ఆలోచించి కచ్చితంగా బీజేపీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కొత్త ఓటర్లు పదేళ్ల క్రితం 10 ఏండ్లు ఉండి ఉంటారని, వారికి ఏం జరిగిందో కూడా తెలియదని, గతంలో దిల్‌ సుఖ్‌ నగర్‌ లో బాంబ్‌ బ్లాస్ట్‌ జరిగిందనే విషయం వారుతెలుసుకోవాలన్నారు. దాదాపు పన్నేండేళ్ల క్రితం యూపీఏ పాలనా సమయంలో దిల్‌సుఖ్‌నగర్‌లో వరుస బాంబు పేలుళ్లు జరిగాయని, మళ్లి కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారంలోకి వస్తే అదే తరహా పేలుళ్లు పునరావృతమవుతాయని హెచ్చరించారు.

కుటుంబంతో కలిసి రెస్టారింట్‌కు వెళ్లినవాళ్లు, థియేటర్‌కు వెళ్లినవాళ్లు పేలుళ్లలో చనిపోయారని ప్రతీ రోజూ యూపీఏ హయాంలో వార్తలు వస్తుండేవని, గడిచిన పదేళ్లుగా అలాంటి వార్తలు వినిపిస్తున్నాయా..? అని ప్రశ్నించారు. దేశంలో ఉగ్రవాదుల ఆగడాలను కట్టడి చేసింది ప్రజలు తమ ఆశీర్వాదంతో ఢిల్లిలో మోదీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన బీజేపీ ప్రభుత్వమని గుర్తు చేశారు. మరోసారి బీజేపీకి ఓటు ద్వారా ఉగ్రవాదులను కట్టడి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే ఉగ్రవాదులను ప్రోత్సహించడేమనని, దేశాన్ని ముక్కలు చేయడమేనని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రజల కమిట్‌మెంట్‌ ఎంతో స్పెషల్‌

భారత ఉజ్వల భవిష్యత్‌ కోసం తెలంగాణ ప్రజలు ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల కమిట్‌ మెంట్‌ ఎంతో స్పెషల్‌ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ తనకెంతో ప్రత్యేకమని, పదేండ్ల క్రితం ఇక్కడే ఒక సభ పెట్టానన్నారు. ఆ సభకు టికెట్‌ పెట్టామని, ఆ దేశ చరిత్రలో టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచిందన్నారు. దేశంలోని నిరాశకు కూడా ఆశ చిగురించిందని చెప్పారు. అదే మాదిరిగా ఇప్పుడు కూడా ఎల్‌బీ స్టేడియం సభకు వచ్చిన జనసందోహాన్ని చూస్తుంటే… తెలంగాణ ప్రజల మూడ్‌ ఏంటనేది తెలుస్తోందని, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎంను ప్రజలు వద్దనుకుంటున్నారని స్పష్టం చేశారు.

జూన్‌ 4న దేశ ప్రజల సంకల్పం గెలవబోతోంది…

జూన్‌ నాలుగున ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలంగాణ ప్రజల మూడ్‌ చెబుతోందన్నారు. జూన్‌ 4 జూన్‌ తర్వాత ఏం జరుగుతుందనేది తనకు స్పష్టంగా కనిపిస్తోందని, జూన్‌ 4 తర్వాత 140 కోట్ల ప్రజలు విజయాన్ని సాధిస్తారని, భారతదేశ విరోధులు మాత్రం ఓడిపోతారని స్పష్టం చేశారు. సీఏఏ, యూనిఫాం సివిల్‌ కోడ్‌, ట్రిపుల్‌ తలాక్‌ ను వ్యతిరేకించేవారు, 370 ఆర్టికల్‌ను, త్రిపుల్‌ తలాక్‌ను, సంతృష్టీకరణ రాజకీయాలను, అవినీతిని సమర్ధించేవారు ఓడిపోతారని స్పష్టం చేశారు.

బీజేపీ ఓటు వేయడమే దేశ సమస్యలకు సమాధానం…

దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు సమాధానం సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయడమేనని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ సొల్యూషన్‌ సిటీ అని కొనియాడిన మోదీ… ఇక్కడ ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. కానీ దేశం అవినీతి సమస్యను అధిగమిస్తుందా..?, లక్షల కోట్ల స్కామ్‌ చేసిన పార్టీలను దాటు-కుని ముందుకు వెళ్తుందా..?, యువతను పట్టించుకోని పార్టీలు దేశ భవిష్యత్‌ ను మారుస్తాయా?, ప్రతి ప్రాజెక్టులో కరెప్షన్‌ చేసే పార్టీలు.. దేశంలో ఆధునిక మౌళిక వసతులను కల్పిస్తాయా..? ఈ అవంతరాలన్నింటినీ దేశం అధిగమించేలా ఎవరు చేస్తారు..? అని ప్రశ్నించారు. ఇవన్నీ చేసేది మోదీ కాదని, ప్రజలు వేసే ఓటు అని వ్యాఖ్యానించారు. మోడీ చేయలేని పనులను ఓటు చేస్తుందన్నారు.

మోదీని గద్దె దించేందుకు కాంగ్రెస్‌ కుట్ర…

ప్రధానిగా మోదీ సేవ దేశానికి అవసరమని భావించిన ప్రజలు కేంద్రంలో బీజేపీకి అవకాశం ఇవ్వడం కాంగ్రెస్‌ కూటమికి నచ్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే మరోసారి కేంద్రంలో మోడీ రాకుండా చేయాలని కుట్ర చేస్తున్నార ని విమర్శించారు. కాంగ్రెస్‌ కు ఓటు వేయడమంటే.. మళ్లీ పాత రోజులు వచ్చినట్లేనని స్పష్టం చేశారు. దేశంలోకి ఉగ్రవాదులు ఎంటర్‌ కావొద్దంటే.. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌, ఇండియా కూటమితో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ఐడియా ఆఫ్‌ ఇండియాపై కాంగ్రెస్‌కు కనీస అవగాహన లేదు…

దేశాన్ని విదేశీ కళ్లద్దాల్లో చూసే కాంగ్రెస్‌కు ఐడియా ఆఫ్‌ ఇండియా అనేదానిపై కనీస అవగాహన కూడా లేదని విమర్శించారు.
వెయ్యేంళ్ల సంస్కృతి, సత్యమేవ జయతే, అహింస పరమోధర్మ:, బుద్ధం శరణం గచ్చామీ, గాడ్‌ ఈజ్‌ గ్రేట్‌.. ఇవన్నీ.. ఐడియా ఆఫ్‌ ఇండియా అని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ యువరాజు (రాహుల్‌ గాంధీ)కు ఒక ఫిలాసఫర్‌ ట్యూషన్‌ చెప్పి కొన్ని ఐడియాలు ఇస్తున్నారని, అయోధ్య రామమందిరం నిర్మాణం జరగొద్దని చెప్పారని, పూజలు కూడా నిర్వహించకుండా అడ్డుకోవాలని యువరాజుకు చెప్పాడని మండిపడ్డారు. దేశంలోని ప్రజలు రాముడిని పూజించొద్దా..?, రాముడిని పూజిస్తే దేశ ద్రోహమా..? అని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్‌ కు మీక ఓటేస్తే అది కాంగ్రెస్‌ కు వేసినట్లేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు వేసే ఓటుతో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాద ని, అందుకే కమలం పువ్వు గర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ తో పాటు ఇతర లోక్‌ సభ స్థానాల్లో పాత గెలుపు రికార్డులను బద్దలుచేయాలని పిలుపునిచ్చారు. ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలోని ప్రతి లోక్‌ సభ సీటును బీజేపీ గెలుస్తుందన్నారు.

అందుకు దాదాపు అన్ని పోలింగ్‌ బూత్‌లలో పార్టీని గెలిపించాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతీ ఇంటికి వెళ్లి ప్రతీ కుటుంబాన్ని కలిసి మోదీని ఆశీర్వదించాలని కోరాలని, తద్వారా ప్రతీ ఇంటికి మోదీ చేరడంతోపాటు శ్రీరాముడు కూడా వెళ్తాడని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.ఈ ఎన్నికల్లో సికింద్రాబాద్‌, చేవేళ్ల, మేడ్చల్‌ మల్కాజిగిరి, భువనగిరి, హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థులు కిషన్‌రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటల రాజేందర్‌, బూర నర్సయ్యగౌడ్‌, మాధవీలతను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

నారాయణపేటలో…

తెలంగాణను కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దోచుకుంటుంటే ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ పేరుతో దోచుకుంటోందని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ఎంపీ అభ్యర్థి డీకే. అరుణకు మద్దతుగా నారాయణపేటలో నిర్వహించిన బహిరంగసభలో ప్రధాని పాల్గొని మాట్లాడారు. ఢిల్లిలోనూ ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని, ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ విషయంలో తాను ఎవరి పేరు చెప్పలేదని, అయినా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారని పేర్కొన్నారు.

రేవంత్‌ స్పందించడం చూస్తుంటే ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ ఎవరు వసూలు చేస్తున్నారో అర్థమవుతోందన్నారు. మహబూబ్‌నగర్‌ ప్రాంతాన్ని బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు తమ స్వార్థానికి వాడుకున్నారని దుయ్యబట్టారు. కృష్ణా, తుంగభద్ర నదుల ఆశీర్వాదం ఈ ప్రాంతానికి ఉందని, సాగునీటి ప్రాజెక్టులకు వేల కోట్లు ఇచ్చినా సద్వినియోగం కాలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు హిందువులు, హిందువుల పండగలు అన్నా ఇష్టం లేదని, తాను గుడికి వెళ్తే దేశ వ్యతిరేక పని చేస్తున్నానని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

దేశంలో హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చేసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మతపరమైన రిజర్వేషన్లు ఇస్తే మతమార్పిడులు పెరిగిపోతాయని హెచ్చరించారు. ముస్లిం రిజర్వేషన్ల కోసం ఎంతో కృషి చేస్తున్న కాంగ్రెస్‌ ఎస్సీల రిజర్వేషన్లను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దేశాన్ని కులాలు, మతాల పేరిట విభజించాలని కాంగ్రెస్‌ చూస్తోందని దుయ్యబట్టారు. దేశం ఏమైనా కాంగ్రెస్‌కు అవసరం లేదని, ఆ పార్టీకి రాజకీయ లబ్దిమాత్రమే కావాలన్నారు. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని గుర్తు చేశారు.

మోడీ గ్యారెంటీ- అంటే అభివృద్ధి కి గ్యారెంటీ అని … రాబోయే అయిదేళ్లలో మూడు కోట్ల ఇళ్ల నిర్మాణానికి గ్యారెంటీ అని 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత వైద్యానికి గ్యారంటీ అని చెప్పారు. గడిచిన పదేళ్లలో తెలంగాణకి లక్షల కోట్లు అందించామని, అయితే వాటితో బీఆర్‌ఎస్‌ తన జేబులనునింపుకుందని, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌ కూటమీ అబద్దపు హామీలు ఇస్తోందని, అలాంటి హామీలతోనే తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పదేళ్లలో ఎంత అవినీతి చేసిందో.. కాంగ్రెస్‌ కొన్ని నెలల్లోనే అంతకంటే ఎక్కువ చేయాలని చూస్తోందని మండిపడ్డారు.

బీఆర్‌ఎస్‌ చేసిన స్కామ్‌ ఫైళ్లపై కాంగ్రెస్‌ కలం కూడా కదిలించడానికి సిద్ధంగా లేదన్నారు. బీఆర్‌ఎస్‌కు జిరాక్స్‌ కాపీలాగా కాంగ్రెస్‌ మారిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్‌ఆర్‌ టాక్స్‌ వేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఢిల్లీలో చాలా చర్చలు నడుస్తున్నాయని తెలిపారు. పాలమూరు ప్రాంత రైతులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా తెలంగాణలో పరిస్థితిని మార్చాలంటే బీజేపీ నేతలను ఎంపీలుగా ఎన్నుకోవాలని కోరారు. ఇక్కడి రైతులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement