Tuesday, November 26, 2024

ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు టీఎస్‌ రెడ్కో చర్యలు.. 2025 నాటికి 3 వేల కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఎలక్ట్రిక్‌ వాహనాలకు చార్జింగ్‌ కేంద్రాలు, ఇతర మౌళిక వసతులు పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాధక శక్తి అభివృద్ధి (టీఎస్‌ రెడ్కో) సంస్థ కృషి చేస్తోంది. 2025 నాటికి రాష్ట్రంలో 3 వేలకు పైగా చార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకుని టీఎస్‌ రెడ్కో సంస్థ ముందుకెళ్లుతోంది. ఇప్పటి వరకు హైదరాబాద్‌లోనే ఎక్కువగా విద్యుత్‌ చార్జింగ్‌ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు రోడ్‌ మ్యాప్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు టీఎస్‌ రెడ్కో చైర్మన్‌ సతీష్‌రెడ్డి తెలిపారు. చార్జింగ్‌ కేంద్రాలకు మౌళిక వసతుల కల్పనను మరింత వేగం చేసేందుకు ఎలక్ట్రిక్‌ వాహన రంగం, అనుబంధ రంగాలకు చెందిన ప్రతినిధులతో గురువారం బంజారాహిల్స్‌లోని అడ్మినిస్ట్రేటివ్‌ స్టాప్‌ కాలేజీ ఆడిటోరియంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి మారుమూల ప్రాంతంలోనూ చార్జింగ్‌ కేంద్రాలకు వసతులు కల్పించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

- Advertisement -

రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, 13 మున్సిపల్‌ కార్పోరేషన్లు, 129 మున్సిపాలిటిల్లోనూ చార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు వసతి కల్పిస్తామని సతీష్‌రెడ్డి తెలిపారు. గత ఏడాదిలో రాష్ట్రంలోనే ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలు దాదాపు ఐదు రెట్లు పెరిగిందని, జాతీయ, రాష్ట్ర రహదారులు, పట్టణాల్లోని ప్రధాన ప్రాంతాల్లో చార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి.. ప్రజలకు ఎలక్ట్రిక్‌ వాహనాలపై ధీమా కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజలు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుకు ముందుకు రావాలని సతీష్‌రెడ్డ పిలుపునిచ్చారు. తెలంగాణ రెడ్కో ఇప్పటి వరకు స్వయంగా 150 చార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిందని, త్వరలోనే మరిన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన వివరించారు. పబ్లిక్‌, ప్రయివేట్‌ భాగస్వామ్యంతో మొదటి చార్జింగ్‌ కేంద్రం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేశామని, అసక్తి ఉన్న వారు ప్రభుత్వ, ప్రయివేట్‌ భాగస్వామ్యం (పీపీపీ మోడల్‌)లో చార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని ఆయన కోరారు. ప్రభుత్వ, ప్రయివేట్‌ భాగస్వామ్యంతో కేవలం హైదరాబాద్‌లోనే దాదాపు 500 చార్జింగ్‌ కేంద్రాలున్నాయని ఆయన వివరించారు. వీటి సంఖ్య త్వరలోనే మరింత పెరుగుతుందన్నారు.

చార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు మౌలిక వసతులు పెంచేందుకు ఈ రంగానికి చెందిన ప్రతినిధులతో ఒక కమిటి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు సతీష్‌రెడ్డి వెల్లడించారు. చార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటులో ఎదురవుతున్న సమస్యను వేగంగా పూర్తి చేయడంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించి ముందుక వెళ్లేందుకు సలహాలు, సూచనలు కూడా తీసుకుంటామని ఆయన తెలిపారు. చార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చిన వారికి సమస్యలను పరిష్కించేందుకు కృషి చేస్తామన్నారు. స్థలంతో పాటు విద్యుత్‌ కనెక్షన్‌కు సంబంధించిన వ్యవహారాలను తాము చూసుకుంటామని సతీష్‌రెడ్డి తెలిపారు. మంత్రులు కేటీఆర్‌, జగదీష్‌రెడ్డిల సహకారంతో ముందుకు వెళ్తున్నామని, దీనికి సంస్థలు కూడ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్కో వైస్‌ చైర్మన్‌ జానయ్య, జీఎం ప్రసాద్‌, వాహనతయారీ సంస్థలు, డీలర్లు, చార్జింగ్‌ నిర్వహణ సంస్థలు, ప్లీట్‌ సర్వీస్‌ ఆపరేటర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement