హైదరాబాద్, ఆంధ్రప్రభ : నిత్యం లక్షలాది వాహనాలు రోడ్డుపైకి వస్తున్నాయి. కాలుష్యం కూడా వేగంగా పేరుగుతోంది. దీంతో ప్రజలు, ప్రాణకోటికి ప్రాణాలకు ముప్పు వచ్చే ప్రమాదం రోజు రోజుకు పేరుగుతోంది. ఢిల్లిdలోని కాలుష్య ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌లో హైదరాబాద్‌లో అలాంటి ముప్పు రాకముందే తెలంగాణ ప్రభుత్వం దిద్దిబాటు చర్యలు చేపట్టింది. ఈ కాలుష్యాన్ని నియంత్రించేందుకు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక అభివృద్ధి సంస్థ ( టీ ఎస్ రెడ్‌కో ) ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. కొత్తగా కొనుగోలు చేసే వాహనాదారులు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే విధంగా ప్రొత్సహించడంతో పాటు పాత ఆటోల ( పెట్రోల్, డీజిల్ ) ను ఎలక్ట్రి క్ వాహనాలుగా ( రెట్రో ఫిట్మెంట్) మార్చేందుకు టీఎస్ రెడ్కో కార్యాచరణ రూపొందింస్తోంది.
పైలెట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్‌లో తొలుత 100 ఆటోల్లో ఎలక్ట్రిక్ కిట్లను బిగించడానికి చర్యలు చేపట్టారు. అందుకు ఆటో యూనియన్లు, రెట్రో ఫిట్మెంట్ కంపెనీలతో టీఎస్ రెడ్కో ఇప్పటికే ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఆటో యూనియన్లు, రెట్రోఫిట్మెంట్ కిట్ తయారీ సంస్థలు, బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాల ప్రతినిధులు ఈ కాన్ఫ్‌రెన్స్‌లో పాల్గొన్నట్లుగా టీఎస్ రెడ్కో చైర్మన్ సతీష్‌రెడ్డి తెలిపారు. అయితే రెట్రో ఫిట్మెంట్ ఎలా చేయాలి..? ఎలాంటి ఆటోలను ఎంపిక చేయాలి..? అమలు తీరుకు సంంధించిన అంశాలపై చర్యలు చేపట్టారు. ఆటోల యజమానులు, యూనియన్లు కూడా సహకరించాలని కోరుతున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా హైదరాబాద్‌లో 100 ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చి.. ఆ తర్వాత విస్తరింప చేయాలని టీఎస్ రెడ్కో నిర్ణయం తీసుకున్నారు.
ఒక్కో ఆటోలో ఎలక్ట్రిక్ కిట్‌ను అమర్చేందుకు రూ. 85 వేలు ఖర్చు అవుతుందని నిర్దారణకు వచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రొత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక్కో వాహనానినికి రూ. 15 వేల సబ్సీడిని ఇవ్వాలని నిర్ణయించారు. మిగతా డబ్బులను కూడా ఫైనాన్స్ సంస్థలతో రుణం ఇప్పించాలనే అభిప్రాయానికి వచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాలతో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. బ్యాటరీ భారం కూడా ఆటో యజమానులపై పడకుండా స్వాపింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి కేవలం యూజర్ చార్జీలు మాత్రమే తీసుకునేందుకు కొన్ని కంపెనీలు కూడా ముందుకొస్తున్నాయి. పెట్రోల్, డీజిల్, సర్వీసింగ్‌కు అయ్యే ఖర్చుతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని రెడ్కో అధికారులు చెబుతున్నారు.
ఈ డబ్బులను బ్యాంకుల నుంచి ఈఎంఐ ద్వారా చెల్లించే వెసులుబాటు కూడా కల్పించబోతున్నారు. అలాగే బ్యాటరీ చార్జింగ్ కోసం ఎక్కువ సమయం వేచి చూడకుండా స్వాపింగ్ కేంద్రాలు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొదట ఎనిమిది స్వాపింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఆటోల సంఖ్య డిమాండ్‌ను బట్టి కేంద్రాలను విస్తరించాలనే యోచనకు వచ్చారు. అందని సలహాలు, సూచనలతో దేశానికి తలమానికమైన పాలసీని తీసుకొస్తామని సతీష్‌రెడ్డి తెలిపారు. ఢిల్లిలో కాలుష్యం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ప్రతి రాష్ట్రం ఒక గుణపాఠంగా తీసుకోవాలని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ముందుగానే మెల్కోని కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవడం అభినందనీయమని చెబుతున్నారు.