Thursday, November 21, 2024

రోడ్ల అభివృద్ధికి టీఎస్‌ ఆర్‌డీసీ రూ.800 కోట్ల సేకరణ.. రుణాల‌కోసం బ్యాంకుల‌ను సంప్ర‌దించాల‌ని నిర్ణ‌యం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: జిల్లా, రాష్ట్ర స్థాయి రోడ్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచేందుకు ఆర్‌అండ్‌బీ, తెలంగాణ రాష్ట్ర రోడ్‌ డవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ ఆర్‌డీసీ) దృష్టి సారించింది. రోడ్ల అభివృద్ధికి రూ.800 కోట్ల రుణ సేకరణ అవసరమని ప్రాథమిక అంచనాకు వచ్చింది. హైదరాబాద్‌లోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో టీఎస్‌ఆర్‌డీసీ చైర్మన్‌ మెట్టు శ్రీనివాస్‌ అధ్యక్షతన సమావేశం జరిగిది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రహదారుల నిర్మాణంపై చర్చించారు. నిర్మాణానికి కావల్సిన ఈ నిధులను ఏదైనా బ్యాంకు నుంచి లోన్‌ ద్వారా సమకూర్చుకోవాలని నిర్ధారించారు. రహదారుల నిర్మాణానికి రూ.800 కోట్ల రుణం తీసుకోవాలన్న చైర్మన్‌ ప్రతిపాదనకు ఈమేరకు బోర్డు అంగీకరించినట్లు తెలిసింది.

రుణం కోసం పలు ఆర్థిక సంస్థలు, బ్యాంకులను సంప్రదించాలని సమావేశంలో నిర్ణయించారు. నిధుల సమీకరణకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను రూపొందించాలని సంబంధిత అధికారులను బోర్డు చైర్మన్‌ ఆదేశించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో టీఎస్‌ఆర్‌డీసీకి సంబంధించిన 2022-23 వార్షిక బడ్జెట్‌కు బోర్డు ఆమోదం తెలిపింది. సమావేశంలో రోడ్లు భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఆర్థికశాఖ కార్యదర్శి శ్రీదేవి, కార్పొరేషన్‌ ఎండీ, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ రవీందర్‌రావు, గ్రామీణ విభాగ రోడ్స్‌ ఈఎన్సీ పింగళి సతీష్‌, ఎస్‌బీఐ నుంచి ఒక ప్రతినిధి హాజరయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement