తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి నెలకొంది. ఈ నేపథ్యంలో.. ర్యాపిడో సంస్థ గుడ్ న్యూస్ వినిపించింది. పోలింగ్ రోజున ఓటర్లను ఉచితంగా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామని…. రాష్ట్రంలో ఓటు శాతాన్ని పెంచుకునేందుకు తమవంతు సహకారం ఎన్నికల సంఘానికి అందిస్తామని చెప్పింది.
తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలకు మే 13న పోలింగ్ జరగనుండగా.. హైదరాబాద్‌తో సహా కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో ఉచిత సేవలు అదించనున్నట్టు ర్యాపిడో సంస్థ వెల్లడించింది. పోలింగ్ రోజున ఈ నాలుగు నగరాల్లో మొత్తం 600 మంది కెప్టెన్లు అందుబాటులో ఉంటారని పేర్కొంది. ఇక పోలింగ్ రోజున ఓటర్లు ర్యాపిడో యాప్‌లో “VOTE NOW” అనే కూపన్ కోడ్‌ను ఉపయోగించి ఫ్రీ రైడ్‌ను పొందొచ్చని సంస్థ వివరించింది.
ఇక, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా 100 నగరాల్లో ఈ సేవలు అందించేందుకు ర్యాపిడో సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం పోలింగ్ రోజున 10 లక్షల మంది కెప్టెన్లను అందజేయనున్నట్టు తెలిపింది. ముఖ్యంగా.. వికలాంగులు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లే మార్గంలో రవాణా వ్యయం లేకుండా తమ హక్కును వినియోగించుకోవచ్చని పేర్కొంది.