Saturday, November 23, 2024

TS | పోలింగ్ రోజున వర్షం.. ఓటింగ్ శాతం పై ప్రభావం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఎండల భయం పోయి వర్షాల ఇబ్బందులు ఈసీకి చెమటలు పోయిస్తున్నాయి. మండే ఎండలనుంచి ఓటర్లకు ఉపశమనం కల్గించి పోలింగ్‌ కేంద్రాలకు వచ్చేలా ఈసీ తీసుకున్న గంట సమయం పెంపు ఇప్పుడు మరో సమస్యకు దారితీస్తోంది. ఇప్పటి వరకూ.. రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ స్థానంలో ఏ అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఉన్నాయి? అనేఉత్కంఠ పోయి ఇప్పుడు పోలింగ్‌ ఎంత శాతం దాటొచ్చనే ఉత్కంఠ చర్చనీయాంశంగా మారింది.

ఈ నెల 13న సోమవారంనాడు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలు ఇప్పుడు పార్టీలను, ఎన్నికల సంఘాన్ని ఆందోళనలో పడేస్తున్నాయి. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనుంది.

మండే ఎండను సైతం లెక్క చేయకుండా ప్రచారం నిర్వహించిన పార్టీలు, నేతలు, అభ్యర్ధులకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. పోలింగ్‌ రోజున రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. అదేవిధంగా పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలైంది.

పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక..

రాష్ట్రంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరిక జారీచేసింది. ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరిక జారీచేసింది.

- Advertisement -

ఈ జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. అదేవిధంగా పలు జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేశారు. వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఈ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక జారీచేసిన వాతావరణ శాఖ.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించింది. పలుచోట్ల వడగళ్ల వాన కూడా కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రాష్టమంతటా ఓటర్లు, ఈసీ, అభ్యర్ధులు అందరిలో ఒకటే టెన్షన్‌ మొదలైంది.

వాతావరణ శాఖ హెచ్చరికలతో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలైంది. సరిగ్గా పోలింగ్‌ రోజున వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. అసలే హైదరాబాద్‌ వంటి చోట్ల సాధారణ రోజుల్లోనే పోలింగ్‌ తక్కువగా నమోదవుతూ ఉంటు-ంది. అలాంటిది వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని బెంబేలెత్తుతున్నారు.

కాగా ఎండల నేపథ్యంలో గత వారం క్రితం పార్టీల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని తెలంగాణలోని రాష్ట్రంలోని 17 లోక్‌ సభ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 వరకు పోలింగ్‌ కు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పర్మిషన్‌ ఇచ్చింది. తాజాగా ఎండలు పోయి వర్షాలు మొదలయ్యాయి. ఇవి మరో నాలుగు రోజులపాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లో కురిసిన ఎడతెరిపిలేని వర్షానికి జనజీవనం అతలాకుతలం అయింది. ఇదే పరిస్థితి పోలింగ్‌ నాడు ఎదురైతే ఇబ్బంది తప్పదని ఎన్నికల సంఘం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement