హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (టీఎస్ పీఈసెట్)-2022 ఈనెల 21 నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ వి.సత్యనారాయణ పేర్కొన్నారు. వరుసగా ఆరవసారి మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం సెట్ నిర్వహణకు ఆతిధ్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఒక్క రోజు జరిగే ఎంపిక ప్రక్రియ మొదటగా సర్టిఫికెట్ వెరిఫికేషన్‌తో ప్రారంభమై, 100 మీటర్ల పరుగు, షార్ట్ పుట్, లాంగ్ జంప్‌లో ప్రతిభ ఆధారంగా ఎంపిక జరగనున్నట్లు తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా ఈసారి ఆరు సెంటర్లలో సెట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలకు, పురుషులకు విడివిడిగా సెంటర్లను కేటాయించినట్లు తెలిపారు. మహిళా అభ్యర్థుల కోసం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, వేద కళాశాల సిద్ధిపేట, వాగ్దేవి కళాశాల వరంగల్ కాగా, పురుష అభ్యర్థులకు ఎంఎంఆర్ కళాశాల చౌటుప్పల్, సిద్ధార్థ కళాశాల ఇబ్రహీంపట్నం, శ్రీకృష్ణ కళాశాల అనుములు నల్గగొండ జిల్లాలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.