హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : మోదీ గ్యారంటీలకు వారంటీ అయిపోయిందని, దేశవ్యాప్తంగా మతతత్వ పార్టీగా ముద్రపడ్డ బీజేపీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఇక పోటీ తప్ప సీటుకు అవకాశమే లేని బీఆర్ఎస్ పార్టీ చెల్లని రూపాయిగా మారిందని విమర్శించారు. సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని అంబర్‌పేట తిలక్‌నగర్ నుంచి ఫీవర్ ఆసుపత్రి వరకు కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌కు మద్దతుగా ముఖ్యమంత్రి రోడ్‌షో నిర్వహించారు.
అశేష జనసందోహం మధ్య జై కాంగ్రెస్ నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. గతంతో కూడా కాంగ్రెస్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందనీ, అందుకు ప్రజలముందు అన్ని ఆధారాలు కనిపిస్తున్నాయని అన్నారు. హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్డు, ఫార్మా పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. గతంలోనే హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి జలాలు తీసుకొచ్చామని చెప్పారు. మెట్రో రైలు కూడా రావడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని రేవంత్‌రెడ్డి వివరించారు.
”పదేళ్లుగా మోదీ అధికారంలో ఉన్నా… కిషన్ రెడ్డి అంబర్ పేట్ బ్రిడ్జి ఎందుకు పూర్తి చేయించలేదు? హైదరాబాద్ నగరంలో వరదలు వస్తే అణా పైసా పేదలకు ఇప్పించలేదు.. బండి పోతే బండి ఇస్తానన్న అరగుండు జాడ లేకుండా పోయారు.. కిషన్ రెడ్డి మళ్లీ ఎంపీ అయినా హైదరాబాద్ నగరానికి, అంబర్ పేట్ కు ఒరిగేదేం లేదు.. కాంగ్రెస్ హయాంలోనే ఈ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందింది. ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరిగింది కాంగ్రెస్ హయాంలోనే.. అంబర్ పేట్ అంటే హనుమంతన్న.. హనుమంతన్న అంటే అంబర్ పేట్.. వచ్చే బతుకమ్మ పండుగ అంబర్ పేట్ బతుకమ్మ కుంటలోనే జరిగేలా చేసే బాధ్యత నాది.. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయం.. రాహుల్ ప్రధాని కావడం ఖాయం” అని సీఎం ధీమా వ్యక్తం చేశారు.
”దానం నాగేందర్‌ను లక్ష మెజార్టీతో గెలిపించండి.. నాగేందర్‌ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది.. మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది.. మన దేశంలో ఆకలి కేకలు ఎక్కువని సర్వేలు తేల్చాయి.. బీఆరెస్ పని అయిపోయింది.. అది చచ్చిన పాముతో సమానం.. కాంగ్రెస్ ఏమీ చేయలేదని కేటీఆర్ అంటుండు.. కేటీఆర్.. నువ్ చీర కట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు.. నిన్ను టికెట్ అడిగితే కాంగ్రెస్ గ్యారంటీలను అమలు చేయనట్లు.. అడగకపోతే గ్యారంటీలు అమలు చేసినట్లు.. తండ్రి, కొడుకులు ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు.. మోసాల కాలం చెల్లింది.. ఇక మిమ్మల్ని నమ్మేవారు ఎవరూ లేదు.. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది.. మోదీ తెచ్చింది ఏమీ లేదు.. గాడిద గుడ్డు తప్ప” అని ఆ రెండు పార్టీలపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
మల్కాజిగిరి పార్లమెంట్‌ను బీజేపీకి తాకట్టు ?
బీఆరెస్ పార్టీ అధికారంలో ఉండి పదేళ్ళ పాటు అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని దోచుకుతినడం తప్ప మరేమీ చేయలేదని, మల్కాజిగిరి పార్లమెంట్‌ను బీజేపీకి తాకట్టు పెట్టింది కేసీఆరేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్తాయిలో ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి ఉప్పల్ కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ, బీఆరెస్ ఒక దిష్టిబొమ్మను ముందు పెట్టింది తప్ప.. ఎన్నికల్లో పోటీ చేయడంలేదని విమర్శించారు.
”అయ్యా.. ఈటెల రాజేందర్..2001 నుంచి 2021 వరకు ఇరవైఏళ్లు కేసీఆర్ తో కలిసి తెలంగాణను విధ్వంసం చేసింది మీరు కాదా..? మీకు పంపకాల్లో పంచాయితీతో విడిపోయారు తప్ప ప్రజల కోసం కాదు.. 2021లో వరదలు వచ్చి ఈ ప్రాంతం ముంపుకు గురైతే ఆనాడు ఈటెల పట్టించుకున్న పాపాన పోలేదు.. పదేళ్లు మంత్రిగా ఉండి ఏనాడైనా ఉప్పల్ కు వచ్చావా..? నువ్ ఏం చేశావని.. ఏం తెచ్చావని మల్కాజిగిరి ప్రజలను ఓటు అడుగుతావ్. మల్కాజిగిరి ప్రజలను ఓటు అడిగే హక్కు నీకు లేదు” అని రేవంత్ మండిపడ్డారు.
పగలు కుస్తీ.. చీకట్లో దోస్తీ! కేసీఆర్.. ఈటల వేర్వేరు కాదు!
”రాజేందర్, కేసీఆర్ వేర్వేరు కాదు.. నాణానికి బొమ్మా బొరుసు లాంటి వారు.. కేసీఆర్ కాళేశ్వరం పేరుతో దోచుకుంటుంటే ఆర్ధిక మంత్రిగా నిధులు విడుదల చేసింది నువ్వు కాదా రాజేందర్.. కరోనా సమయంలో సంతోష్ రావు కోట్లాది రూపాయలు వెనకేసుకుంటుంటే.. వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నది నువ్వు కాదా రాజేందర్.. నువ్వే కదా దొంగలకు సద్దులు మోసింది రాజేందర్.. అప్పుడే మర్చిపోయావా? హైదరాబాద్ చుట్టు భూములను దోచుకుంటుంటే.. చూస్తూ ఊరుకుంది నువ్వు కాదా? గద్దర్‌ను అవమానించిన నాడు ఎందుకు ప్రశ్నించలేదు.. కేసీఆర్ అవినీతిపై ఈటెల ఏనాడైనా అమిత్ షా, మోదీకి పిర్యాదు చేశారా? ఈటెల, కేసీఆర్‌ది పగలు కుస్తీ.. చీకట్లో దోస్తీ.. ఈటెలకు పదవి, పరపతి తప్ప..తెలంగాణ ప్రజల సంక్షేమం పట్టదు.. రిజర్వేషన్లు రద్దు చేసే బీజేపీ వైపు ఉంటారో… ఎస్సీ, ఎస్టీ, బీసీల వైపు ఉంటారో రాజేందర్ తేల్చుకోవాలి.. అంగీ మార్చినా, రంగు మార్చినా.. ఎన్ని వేషాలు వేసినా రాజేందర్ ను ప్రజలు నమ్మరు.. మోదీ తెలంగాణకు ఇచ్చిందేం లేదు.. గాడిద గుడ్డు తప్ప.. మల్కాజిగిరి పార్లమెంట్లో సునీతక్కను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించండి” అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.