హైదరాబాద్, ఆంధ్రప్రభ : కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌లో కోత్తరూట్లలో మెట్రో రైలు విస్తరణ పనులు శరవేగంగా ముందుకు వెళ్లుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌కు మెట్రోరైలు తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అంటూ సీఎం గుర్తు చేశారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు ఒక కొత్త ప్రాజెక్టు రాలేదని చెప్పారు.
శుక్రవారం గోషామహల్ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ ఆభివృద్ధి జరగాలన్నా కొత్త ప్రాజెక్టులు రావలన్నా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే సులువుగా సాధ్యం అవుతోందన్నారు. పాతబస్తీ అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగెలుపు తోనే అభివృద్ధి సాధ్యం అవుతోందన్నారు.
నాలుగు శతాబ్దాలు హైదరాబాద్ ప్రతిష్ట మెరుగు వాలంటే కాంగ్రెస్ గెలుపుతోనే సాధ్యం అవుతోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మనుషులు, మతాల మధ్య విభేదాలు సృష్టించి గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని చెప్పారు. ఎంఐఎంను గెలిపిస్తే హైదరాబాద్ అభివృద్ధికి ఎలాంటి ఉపయోగం లేదన్నారు. మోదీ, ఒవైసి హైదబాద్‌కు మెట్రో తీసుకు రాలేదని కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మెట్రో వచ్చిందని గుర్తు చేశారు.
పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్ లో మెట్రో విస్తరణ ఎందుకు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు మోడీ ఒక్క పైసా కూడా ఇవ్వడంలేదన్నారు. మూసీ అభివృద్ధితో హైదరాబాద్, సికింద్రాబాద్ మరింత అభివృద్ధి సాధిస్తోందని చెప్పారు. ఆరుగ్యారెంటీల్లో ఇప్పటికే ఐదింటిని అమలు చేసినట్లు చెప్పారు. ఆర్టీసీలో మహిళలు ఉచిత ప్రయాణ కల్పించామని గుర్తు చేశారు.
ఐదువందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చమని చెప్పారు. ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచామన్నారు. పాతబస్తీ ప్రజలు ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు.20 ఏళ్లుగా హిందూ ముస్లీంల మధ్య ఎలాంటి గొడవలు లేవు మత సామరస్యంతోనే హైదరాబాద్‌కు ఐటీ సంస్థలు వచ్చాయని చెప్పారు. పాతబస్తీ ప్రజలు కర్ఫ్యూ మర్చి పోయారన్నారు.
అయితే బీజేపీ గొడవలు సృష్టించి హైదరాబాద్‌కు వచ్చే పరిశ్రమలు గుజరాత్‌కు తరలించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ, ఎంఐఎం విద్వేష ప్రసంగాలు వినవద్దని సీఎం రేవంత్ రెడి చెప్పారు. కాంగ్రెస్ లో చేరిన వంగ లక్ష్మన్ గౌడ్‌ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.