తెలంగాణ రాష్ట్రంలో పలు శాఖలకు చెందిన ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా కేంద్ర సర్వీసులో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిణి అమ్రపాలిని రాష్ట్ర సర్వీసులకు తీసుకువచ్చారు. ఆమెకు అత్యంత కీలకమైన హెచ్ఎండీఏ కమిషనర్ పదవిని ప్రభుత్వం అప్పగించింది. హైదరాబాద్ మెట్రోపాలిటిన్ డెవలప్ మెంట్ అథారిటీ కమిషనర్ గా అమ్రపాలి నియామకం ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
ఇరిగేషన్ సెక్రెటరీగా రిజ్వీని నియమిస్తూ ఆయనకు అదనంగా ట్రాన్స్ కో అండ్ జెక్ కో చైర్మన్ ఎండీగా బాధ్యతలను అప్పజెప్పింది. అలాగే, ట్రాన్స్ కో జాయింట్ మ్యానేజింగ్ డైరెక్టర్ గా సందీప్ కుమార్ ఝా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓఎస్డీతో పాటు ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీగా ఐఏఎస్ కృష్ణ భాస్కర్ నియమించారు. ఎస్పీడీసీఎల్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ముషారఫ్ అలీ, టీఎస్ఎన్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా వరుణ్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అగ్రికల్చర్ డైరెక్టర్గా బి. గోపి, ఆరోగ్య శాఖ కమిషనర్గా శైలజా రామయ్యర్ లను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.