లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే.. తెలంగాణ సాయుధ పోరాట యోధులు గుర్తుకువస్తారని చెప్పారు. ఇక్కడ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్లమెంట్‌లో తెలంగాణ వాదం వినిపించి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. తెలంగాణ కోసం తన మంత్రి పదవిని వదులుకున్నారని, కోమటిరెడ్డి బ్రదర్స్ పదవులు ఉన్నా లేకున్నా ప్రజా సేవలో నిమగ్నమయ్యారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. నాతో పాటు ముఖ్యమంత్రిగా అర్హత ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అని రేవంత్ రెడ్డి అన్నారు. నేను గతంలో ఎలా ఉన్నానో.. ఇప్పుడు సీఎం అయ్యాక కూడా అలానే ఉన్నానని చెప్పారు.
చామల కిరణ్ ను 3లక్షల మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. చామల కిరణ్‌ను గెలిపిస్తే.. భువనగిరిని ట్రిపుల్ ఇంజన్‌లా అభివృద్ధి చేస్తారని చెప్పారు. చామల కిరణ్‌ను గెలిపిస్తే.. యదాద్రిని మళ్లీ యాదగిరిగుట్టగా మార్చుకుందామన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా మాట ఇస్తున్నా.. పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది.. వచ్చే పంటకు రూ.500 బోనస్ అందించే బాధ్యత నాది అంటూ రేవంత్ భరోసా ఇచ్చారు.
రాష్ట్ర అవతరణను తప్పు పట్టిన బీజేపీ కి ఓట్లు అడిగే అర్హత లేదని చెప్పారు. నరేంద్రమోదీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. బాబా సాహెబ్ అంబెడ్కర్ రాసిన రాజ్యాంగం స్వేచ్ఛగా అమలు కావాలి అంటే.. ఇండియా కూటమి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.
రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చినప్పుడు సీఏఏ చట్టం తెచ్చినప్పుడు.. ఇలా ప్రతిసారి కేసీఆర్ మోడీకి మద్దతు ఇచ్చారని విమర్శించారు. 100 రోజులకే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలి అనడం న్యాయమా కేసీఆర్? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఉద్యోగ కల్పన అని నిరుద్యోగులను మోసం చేసి సొంత కుటుంబ సభ్యులకు మాత్రం అందరికి ఉద్యోగాలు ఇచ్చారని రేవంత్ మండిపడ్డారు. ఉద్యోగాల కల్పనలో భువనగిరి సెంటర్‌లో చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు.
మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశం కల్పించామని, పేదలకు వైద్య సహాయం కోసం ఆరోగ్యశ్రీ పరిమితి పెంచామన్నారు. వంద రోజుల్లోనే ఐదు పథకాలు అమలు చేశామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మూసీని ప్రక్షాళన చేసి మూసీ మురికి నుంచి విముక్తి చేసే బాధ్యత నాదన్నారు. గంధమల్ల, బ్రాహ్మణ వెల్లం, ఎస్ఎల్బీసీ పూర్తి చేసే బాధ్యత నాదన్నారు.