హైదరాబాద్, ఆంధ్రప్రభ : పూర్తిస్థాయి ఆటోమేటెడ్, కంప్యూటరైజ్డ్ మల్టీ లెవల్ కార్ పార్కింగ్ పనులు దాదాపు పూర్తి కావడం పట్ల భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పీపీపీ విధానంలో నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో ఈ మల్టీలెవల్ కారు పార్కింగ్‌ను నిర్మించాలని 2016/2017లో నిర్ణయించామని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైన ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు పూర్తికావచ్చిందని అన్నారు.
ఇటువంటి మల్టీలెవల్ కార్ పార్కింగ్ విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్లాలని కేటీఆర్ సూచించారు. ముఖ్యమైన జంక్షన్లు, మెట్రో స్టేషన్లు, కమర్షియల్ సెంటర్లకు సమీపంలో ఇలాంటివి మరిన్ని కట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు. నాంపల్లి మెట్రో స్టేషన్‌కు సమీపంలో హెచ్‌ఎంఆర్‌ఎల్‌కు చెందిన అర ఎకరం స్థలంలో 15 అంతస్తుల్లో ఈ కాంప్లెక్సు నిర్మాణం జరుగుతుంది.
ఇందులో 10 అంతస్తుల్లో వాహనాల పార్కింగ్ సౌకర్యం, ఐదు అంతస్తుల్లో కమర్షియల్ షాపులు, రెండు స్కీన్ర్‌లతో కూడిన సినిమా థియేటర్ ఉంటు-ంది. మొత్తం 1,44,440 చదరపు అడుగుల విస్తీర్ణంలో 68శాతం పార్కింగ్, 32 శాతం వాణిజ్య సముదాయాలకు కేటాయిస్తున్నారు. పార్కింగ్ స్థలంలో 250 కార్లు, 200 ద్విచక్ర వాహనాలు నిలిపేందుకు అవకాశం ఉంటుంది.
కాంప్లెక్స్‌లోని గ్రౌండ్ ప్లోర్‌లో 4 లోపలకు, బయటకు వెళ్లే టర్మినల్స్ ఉన్నాయి. వాహనాల నిలుపుదల కోసం టర్న్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఈ టేబుల్‌పై వాహనదారుడు తమ వాహనాన్ని వదిలి తమ నిర్ధేశిత పనులకు వెళ్లిపోవచ్చు. ఎంఎల్‌పీలోనికి వాహనం ప్రవేశించిన సమయంలో వాహనదారులకు స్మార్ట్ కార్డు జారీ అవుతుంది. తరచూ ఎంఎల్‌పీ వినియోగించే వారికి ఆర్‌ఎఫ్‌ఐడీ కార్డులు జారీ చేస్తారు.
వాహనం కొలతల ఆధారంగా కంప్యూటరైజ్డ్ పార్కింగ్ సిస్టమ్ ద్వారా వాహనాల వర్గీకరణ జరుగుతుంది. ఎస్‌యూవీ లేదా సెడాన్ వాహనానికి తగినట్లుగా పార్కింగ్ సదుపాయం కేటాయించబడుతుంది. ఆ తర్వాత ట్రాన్స్‌పోర్టర్ షటిల్ ఆ వాహనాన్ని లిప్ట్ ద్వారా నిర్ణీత అంతస్తులో కేటాయించిన స్థలంలో పార్క్ చేస్తుంది.
పార్కింగ్ చేసిన వాహనాన్ని తిరిగి పొందడానికి డ్రైవర్ పార్కింగ్ రుసుమును చెల్లించి, పార్కింగ్ టికెట్‌ను కార్డ్ రీడర్‌కు చూపగానే ట్రాన్స్‌పోర్టర్ షటిల్ ఆటోమేటిక్‌గా కారును వాహనదారుడికి అందజేస్తుంది. పార్కింగ్ కోసం కేవలం ఒక నిమిషం కంటే తక్కువ సమయం, తిరిగి పొందడానికి 2 నిమిషాల సమయం మాత్రమే పట్టనుంది.