హైదరాబాద్, ఆంధ్రప్రభ : సాగునీటి రంగంలో అద్భుతాలు సృష్టించి గోదావరి ప్రవాహ దిశనుమార్చిన కాళేశ్వరం ఉత్తరతెలంగాణ జీవధారగా భాసిల్లుతోంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాల్లో భాగంగా ప్రధాన ఎత్తిపోతల పథకాల నిర్మాణాలను ప్రభుత్వం పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తున్నప్పటికీ ఇంకా ప్రాజెక్టు విస్తీర్ణం పెంచి ఏనాడు సాగు నీటిని నోచుకోని ప్రాంతాలకు నీరందించాలనే లక్ష్యంతో ప్యాకేజీల వారీగా పనులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా 7వ లింకు నుంచి 22వ ప్యాకేజీ వరకు పనులను పూర్తి చేసి ప్రస్తుత వర్షాకాలంలోనే నీటిని నిల్వచేసేందుకు పనుల్లో ప్రభుత్వం వేగం పెంచింది.
ఇందులో భాగంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని 56 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు రూ. 1446కోట్ల 48 లక్షల వ్యయంతో కాళేశ్వరం 7వ లింకు 22వ ప్యాకేజీ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు రూ. 439కోట్ల 69 లక్షల విలువైన పనులు జరిగినట్లు అధికారిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే ఈ ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్‌తో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మరో 44 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు సాగునీటి పారుదలశాఖ పనులు ప్రారంభిస్తోంది. దీంతో ఈ నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగునీరు అందించే అవకాశాలను నీటి పారుదల శాఖ కల్పించింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుత వర్షాకాలంలోనే రిజర్వాయర్లు నిర్మించి నీటిని నిల్వచేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. ఇందులో భాగంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి, మెదక్, దుబ్బాక, బాన్సువాడల్లో ప్యాకేజీ 22 కింద చేపట్టిన జలాశయాల నిర్మాణాలు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. ఈ జలాశయాలతో మరో లక్ష ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశాలను ప్రభుత్వం అంచనా వేస్తోంది. 7వ లింకులో భాగంగానే 20,21,21ఏ కింద కొండెం చెరువు, మంచిప్పచెరువులను అనుసంధానం చేసి రిజర్వాయర్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు ఇచ్చిపనుల్లో వేగంపెంచింది. కాళేశ్వరం నిర్మాణం తో తెలంగాణ సాగునీటి రంగంలో సృష్టించిన అద్భుతం ద్విగుణీకృతం కాగా ప్రస్తుతం ప్రాజెక్టు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచి ఉత్తర తెలంగాణలోని ప్రతి ఎకరాకు నీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్లుతోంది.
అలాగే కేశవాపూర్ జలాశయాన్ని పూర్తి చేసి హైదరాబాద్ కు సాగునీటి సౌకర్యాన్ని మెరుగుపర్చడంతో పాటుగా అవసరమైతే దక్షిణ తెలంగాణకు నీటివనరులను సమకూర్చేందుకు కాళేశ్వరం సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టి స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా గుర్తింపు పొంది 13 జిల్లాల నుంచి 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించి 7లింకులు 28 ప్యాకేజీలుగా విభజింపబడి 1800 కి.మీ నెట్ వర్క్ తో విస్తరించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం 169 టీఎంసీల సాగునీటికోసం, 30 టీఎంసీల తాగునీటికి, 16 టీఎంసీల పారిశ్రామిక అవసరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల తాగునీటి అవసరాలు తీరుస్తోంది. అయితే ప్యాకేజీల్లో విభజించిన కొద్ది పాటి పనులను కూడా పూర్తి చేసి తెలంగాణ జీవధారగా భవిష్యత్ అవసరాలను కూడా తీర్చేందుకు సిద్ధమతోంది.