లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాలలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మనకు న్యాయం జరగాలంటే బీఆర్‌ఎస్ ఎంపీలే ఉండాలని తెలిపారు. బీఆర్ఎస్ బిడ్డలు అయితేనే పేగులు తెగే దాకా కొట్లాడతరు తప్ప.. ఎవరూ కొట్లాడరని స్పష్టం చేశారు. అందుకే ఆలోచించి ఓటు వేయాలి తప్ప ఆగమాగం వేయవద్దని యువ సోదరులకు బీఆర్ఎస్ అధినేత సూచించారు. ఎవరు గెలిస్తే మంచిదని ఆలోచన చేయాలని హితవు పలికారు.
మోదీ ప్రభుత్వం అన్నీ ఝూటా వాగ్ధానాలు అని… కేంద్రంలో మోదీ ప్రభుత్వ పాలనలో దేశంలో అడ్డగోలుగా ధరలు పెరిగిపోయాయని బీఆర్‌ఎస్ కేసీఆర్ మండిపడ్డారు. ఆయన పాలనలో ఎవరికీ ఒరిగిందేమీ లేదని విమర్శించారు. నరేంద్ర మోదీ పదేళ్లు అయ్యింది దేశానికి ప్రధాని అయి.. అచ్చేదిన్ పోయి సచ్చేదిన్ మాత్రం వచ్చాయి అని అన్నారు. ప్రభుత్వం సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని చెప్పి.. సబ్ కా సత్యనాశ్ చేసిందని విమర్శించారు. బీజేపీకి నలుగురు ఎంపీలు గెలిచి.. నాలుగు రూపాయలు అయినా తెచ్చిండ్రా.. ఏమైనా అభివృద్ధి చేసిండ్రా అని ప్రశ్నించారు. వీళ్లకు ఎందుకు ఓటేయ్యాలని అన్నారు.
మనకు ఉన్నది ఒక్కటే గోదావరి.. ఈ గోదావరిని కూడా తమిళనాడుకు తీసుకుపోతా.. కర్ణాటకకు తీసుకుపోతా అని నరేంద్ర మోదీ అంటున్నాడని కేసీఆర్ తెలిపారు. మీ కండ్ల ముందే మీ గోదావరిని ఎత్తుకుని పోతా అని నరేంద్రమోదీ అంటుంటే.. ఈ ముఖ్యమంత్రి సప్పుడు చేయడం లేదన్నారు. మరి గోదావరిని ఎవరు కాపాడాలి? బీజేపీ ఎంపీలు గెలిస్తే మాట్లాడతారా? కాంగ్రెసోళ్లు మాట్లాడతారా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే పార్లమెంటులో దద్దరిల్లేలా కొట్లాడతారని స్పష్టం చేశారు.
ఈ రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల జిల్లాను తీసేస్తా అంటున్నది. జగిత్యాల జిల్లా ఉండాలంటే నిజామాబాద్ ఎంపీగా బాజిరెడ్డి గోవర్దన్ గెలవాలి. పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్ గెలవాలి. కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ గెలవాలి. ఇప్పుడున్న ప్రభుత్వానికి నా తోక తెల్వది.. తొండం తెల్వది. ఏ పని సక్కగా చేయస్తలేదు అని అన్నారు.
ఏ ఊరికిపోతే ఆ ఊరి దేవుడిపై రేవంత్ రెడ్డి పెడుతున్నడు. అరచేతిలో వైకుంఠం చూపెట్టి.. అడ్డగోలు హామీలు ఇచ్చి.. ఇష్టంవచ్చిన పద్ధతిలో నోటికి వచ్చిన వాగ్ధానాలు చేసి కాంగ్రెస్ ఈ రోజు ప్రజలను మోసం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదునెలల్లోనే ఆగమాగం చేస్తున్నరు. బీడీ కార్మికుల గురించి పట్టింపు లేదు. చేనేత కార్మికుల గురించి పట్టింపులేదు. గీత కార్మికులకు పట్టింపులేదు. విద్యార్థుల గురించి పట్టింపులేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తలేదు. ఓవర్సిస్ స్కాలర్‌షిప్ వస్తలేదు. దీనికి కారణాలు ఏంటీ? వారు చెప్పిన ఆరు గ్యారంటీల్లో ఏదైనా అమలైందా? కొత్త స్కీమ్‌లు గంగలో కలిసినయ్. ఒక్కటీ అమలుకాలేదు. పాత స్కీమ్‌లు బంద్‌పెట్టే దుర్మార్గం జరుగుతుంది అని అన్నారు.
వరద కాలువను మన హయాంలో రిజర్వాయర్‌గా చేసుకున్నాం. వరద కాలువ వెంట ఎన్నికావాలంటే అన్ని తూములు పెట్టి చెరువులను నింపుకున్నాం. ఆ చెరువుల కింద వ్యవసాయం చేసి రైతులు బ్రహ్మాండంగా బతికారు. ఇవాళ వరద కాలువను ఎందుకు ఎండబెట్టారని అడుగుతున్నా? పంటలు ఎండబెట్టారు. దానికి ఎవరు బాధ్యతలు ఆలోచన చేయాలి అని సూచించారు.