హైదరాబాద్, ఆంధ్రప్రభ : పేదరికం కారణంగా ఏ ఒక్కరూ చదువుకు దూరం కావొద్దనే ఆశయంలో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో గురుకుల విద్యా సంస్థలను ఏర్పాటు చేశామని ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. తెలంగాణలో ఐదు సొసైటీల ద్వారా 985 గురుకుల పాఠశాలల్లో సుమారు 6 లక్షల మంది విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు పోషకాహారాన్ని ఉచితంగా అందజేస్తున్నామని ఆయన వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లోని మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యాలయంలో వివిధ కోర్సుల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన పలువురు విద్యార్థులను అభినందించి జ్ఞాపికలను మంత్రి కొప్పుల అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు మంచి విద్యను అందించాలనే సీఎం కేసీఆర్ సదాశయంతో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న గురుకుల విద్యా సంస్థలకు దేశంలోనే మంచి పేరు ఉందన్నారు. పలు కోర్సుల్లో అత్యుత్తమ ఫలితాలతో పాటు క్రీడల్లో కూడా గురుకుల విద్యార్థులు రాణిస్తున్నారని ఆయన తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేస్తున్న ఉపాధ్యాయులు గురుకులాల్లో ఉండటం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు ఏ.కె. ఖాన్, సొసైటీ అదనపు కార్యదర్శి దిలావర్ తదితరులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర వజ్రోత్సవాలు విజయవంతం చేద్దాం భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి కొప్పుల పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లాలోని అన్ని మండల, మున్సిపాలిటీ స్థాయిలో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆయన సూచించారు. జాతీయ జెండా గౌరవ మర్యాదలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇంటింటా జాతీయ జెండా ఎగురువేసే విధంగా చర్యలను తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. శనివారం జూమ్ కాన్ఫరెన్స్‌ను మంత్రి కొప్పుల నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లాలోని సూమారు 42 వేల మంది విద్యార్థులకు ఆగస్టు 9 నుంచి 21 వరకు ప్రతిరోజు ఉదయం గాంధీ సినిమా చూపించాలన్నారు. ఫ్రీడమ్ పార్క్ ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 75 వేల మొక్కలను నాటేందుకు వీలుగా అనువైన స్థలాలను గుర్తించాలని అధికారులను ఆయన ఆదేశించారు.