రాష్ట్రంలో కరోనా మూడో వేవ్ తగ్గుముఖం పట్టడంతో పదో తరగతి వార్షిక పరీక్షలతోపాటు, వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఎంట్రెన్స్‌లు నిర్వహించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే జూన్ సెకండ్ వీక్‌లో టీఎస్ ఎంసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది. అలాగే మే 6 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నట్లుగా సమాచారం. ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు ఇప్పటికే ప్రకటించడంతో ఇక ఎంసెట్ పరీక్ష తేదీలను ఖరారు చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. మే 5న ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ముగుస్తుండటంతో జూన్ సెకండ్ వీక్‌లో ఎంసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. ఇప్పటికే అన్ని సెట్స్‌లకు కన్వీనర్లను ఉన్నత విద్యామండలి నియమించింది. తాజాగా ప్రవేశ పరీక్షల నిర్వహణ కమిటీలను కూడా ఖరారు చేసినట్లు తెలిసింది.
కరోనా కారణంగా ఈ విద్యా సంవత్సరం చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. దీని ప్రభావం ప్రవేశ పరీక్షలపైన కూడా పడుతోంది. అయితే 70 శాతం సిలబస్‌తోనే ప్రవేశ పరీక్షలను నిర్వహించాలని యోచిస్తున్నారు. వివిధ ఎంట్రెన్స్‌ల్లో అర్హత మార్కుల విషయంలో గతేడాది మార్గదర్శకాలనే యధావిథిగా కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు. జనవరి నెలలో ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్ తదితర ప్రవేశ పరీక్షలను నియమించారు. ఈ సెట్స్‌లకు సంబంధించిన కమిటీలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఇంటర్, డిగ్రీ పరీక్షల ఆధారంగానే అన్ని సెట్స్ నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే ఇంటర్ షెడ్యూల్ వచ్చింది. డిగ్రీ పరీక్షలు కూడా ఏప్రిల్ నుంచి మే మొదటి వారంలోపు అయ్యే ఛాన్స్ ఉంది. ఈక్రమంలో జూన్ రెండో వారంలో ఎంసెట్‌ను నిర్వహించి జులై మొదటి వారం వరకు మిగతా అన్ని సెట్లను పూర్తి చేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. పీఈసెట్ మినహా మిగిలిన అన్ని ఎంట్రెన్స్‌లు ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. అయితే ఐఐటీల్లో ఎంట్రెన్స్ కోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2022 షెడ్యూల్‌ను బట్టి ఎంసెట్ తేదీల్లో ఏమైనా మార్పులు చేసే అవకాశాలూ ఉన్నాయని అధికారులు చెప్తున్నారు.
మే 6 నుంచి లేదా 9 నుంచి.?
పదో తరగతి పరీక్షలను మే 6వ తేదీ నుంచి నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నట్లుగా విద్యా వర్గాల ద్వారా తెలిసింది. సాధారణంగా ఇంటర్ పరీక్షలు ముగిసిన వెంటనే పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలోనే ఇంటర్ పరీక్షలు మే5వ తేదీన అయిపోతున్నాయి. దీనిప్ర కారంగా చూసుకుంటే మే 6వ తేదీ శుక్రవారం నుంచి లేదా మే 9 సోమవారం నుంచైనా ఉంటాయని సమాచారం. అయితే పరీక్షల నిర్వహణపై ఉన్నతాధికారులు సమావేశమై షెడ్యూల్‌ను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. పదో తరగతి పరీక్షలు ఈ సారి కూడా 70 శాతం సిలబస్‌తో ఆరు పేపర్లతోనే ఉండే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..