Saturday, November 23, 2024

TS | ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి… : ఈసీ

తెలంగాణ‌లో రెండ్రోజుల్లో లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో సీఈఓ వికాస్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.. మే 13 పోలింగ్ రోజున అన్ని కంపెనీలు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని, ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకూ ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంటుందని, టీవీ ఛానల్స్, వెబ్ సైట్స్, ఇంటర్నెట్ ప్లాట్ ఫామ్స్.. ఇలా ఎక్కడ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఏ పార్టీ తరఫున ప్రకటన ఇవ్వాలన్నా ఈసీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు.

తెలంగాణలో ఎన్నికలకు 87 వేలకు పైగా బ్యాలెట్ యూనిట్లను వాడామన్నారు. హోం ఓటింగ్, సర్వీస్ ఓటింగ్ ముగిసిందని తెలిపారు. హోం ఓటింగ్ తో 21,680 మంది వేయగా.. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం.. 1,88,000 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసినట్లు తెలిపారు. ఇంకా ఎన్ని పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయో పూర్తిగా లెక్కించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 90 వేల మంది ఎన్నికల విధులలో ఉంటారని, 34,973 మంది ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ తీసుకుని ఓటు వేస్తారని వివరించారు.

ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకోవాలంటే 1950 నంబర్ కు స్లిప్ పై ఉన్న నంబర్ ఎస్ఎంఎస్ చేస్తే పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్ మొబైల్స్ కు వస్తాయని తెలిపారు. వేసవి దృష్ట్యా పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. పోలింగ్ బూత్ లలో డ్రింకింగ్ వాటర్, ఫ్యాన్లు, కూలర్లు పెట్టాలని బూత్ నిర్వాహకులకు సూచించామని, పారామెడికల్ సిబ్బంది మెడిసిన్ తో అందుబాటులో ఉంటారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement