హైదరాబాద్, ఆంధ్రప్రభ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రధాని ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇవాళ ఎల్బీ స్టేడీయంలో జరిగిన భాగ్యనగర్ జనసభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సభతో తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ఆయన ముగించారు. ఇప్పటి వరకు ప్రధాని మోదీ తెలంగాణలో ఇప్పటి వరకు 7 బహిరంగ సభలు, ఒక రోడ్డు షో నిర్వహించారు.
సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, భువనగిరి, హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థులకు మద్దతుగా శుక్రవారం భాగ్యనగర్ జనసభలో ప్రధాని పాల్గొన్నారు. తెలంగాణలో ప్రధాని చివరి ఎన్నికల ప్రచార సభ కావడంతో కమలనాథులు భారీ సంఖ్యలో జన సమీకరణ చేశారు.
దీంతో ఎల్బీ స్టేడియం కాషాయ మయమైంది. కేంద్రంలో మూడోవసారి అధికారమే లక్ష్యంగా ప్రధాన మంత్రి మోదీ దేశవ్యాప్తంగా సుడిగాలి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తన ప్రసంగాలతో అన్ని వర్గాలను ఆకర్షిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా మోదీకి అంతా మద్దతు పలుకుతున్నారు.
దివ్యాంగులపై ప్రధాని ఔదార్యం…
ప్రచార సభల్లో ప్రత్యర్ధులపై నిప్పులు చెరిగే ప్రధాని మోదీలో మరో కోణం ఆవిష్కృతమైంది. నారాయణపేట సభలో దివ్యాంగులపై మోదీ చూపించిన ఔదార్యం శుక్రవారం నాటి జన సభకే హైలైట్ అయ్యింది. మహబూబ్ నగర్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ.. మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మోదీ ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా ఆయన చూపు సభకు హాజరైన దివ్యాంగులపై పడింది.
వెంటనే స్పందించని మోదీ, వారిని జనం మధ్యలో నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకు రమ్మని సూచించారు. దీంతో ఆ ఇద్దరు దివ్యాంగు మహిళలను వాలంటీర్లు సభ ప్రాంగణంలో తీసుకువచ్చారు. ఈ సందర్భంగా తనపై ప్రేమతో వ్యయప్రయాసలకు ఒడ్చి బహిరంగ సభకు హాజరైనందుకు ఆ దివ్యాంగులకు ప్రధాని మోదీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.