Saturday, November 23, 2024

TS | బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణకు శత్రువులే.. వాటిని ఓడించాల్సిందే : కేసీఆర్

సూర్యాపేట/ భువనగిరి : పదేండ్ల బీజేపీ పాలనలో ఏ వర్గానికి అయినా న్యాయం జరిగిందా అని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రశ్నించారు. సూర్యాపేట, భువనగిరిలో పోరు బాట పేరుతో నేడు నిర్వహించిన బస్‌యాత్ర సభలో ఆయన మాట్లాడుతూ, మేక్‌ ఇన్‌ ఇండియా, సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌ వంటి పెద్ద పెద్ద నినాదాలు ఇచ్చారు.. వాటి వల్ల ఏమైనా లాభం జరిగిందా అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 18 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిని భర్తీ చేయడానికి మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.

భేటీ బచావో – బేటీ పడావో అని నినాదమిచ్చారు.. మరి ఒక్క బేటీని అయినా బచాయించారా? ఒక్క బేటీ అయినా పడాయించారా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మహిళలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దళిత, పేద మహిళలపై దాడులే జరుగుతున్నాయని అన్నారు. దేశ చరిత్రలో ఏనాడు కూడా పడిపోని విధంగా రూపాయి విలువ రూ.83కి పడిపోయిందని తెలిపారు. అంతర్జాతీయంగా ఇదీ భారతదేశ గౌరవం.. ఇది బీజేపీ పరిపాలన ఫలితమని అన్నారు

ఒక పార్టీ ఏమో దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుద్ది.. ఇంకో పార్టీ ఏమో ఏ ఊరికి వెళ్తే ఆ ఊరి దేవుడి మీద ఒట్లు పెట్టుకుంటుందని కేసీఆర్‌ విమర్శించారు. ఒకడేమో ఓట్లు.. ఒకడేమో ఒట్లు ఇదే రాష్ట్రంలో జరుగుతుందని విమర్శించారు. అద్భుతమైన యాదాద్రి దేవాలయాన్ని నిర్మించుకున్నాం.. కానీ ఏనాడైనా దాన్ని ఓట్ల కోసం వాడుకున్నామా? అని ప్రశ్నించారు. ఒకడొచ్చి బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీటీమ్‌ అని కొంతమంది అంటున్నారని.. కానీ భువనగిరిలో ఏం జరిగిందని గుర్తుచేశారు. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్‌ మిలాఖత్‌ అయిపోయి.. బీఆర్‌ఎస్‌ చైర్మన్‌ను దించేశారని అప్పుడు కాంగ్రెస్‌ నుంచి చైర్మన్‌, బీజేపీ నుంచి వైఎస్‌ చైర్మన్‌ అయ్యారని చెప్పారు. మరి ఎవరికి ఎవరు బీ టీమ్‌ అని ప్రశ్నించారు.

ఇవాళ మోదీ ప్రభుత్వ హయాంలో రూపాయి విలువ పడిపోయింది.. మహిళలకు రక్షణ లేదు.. పేదరికం, నిరుద్యోగం పెరిగిపోతుంది.. ఇలా అనేక సమస్యలు ఉంటే, అదేమీ లేదన్నట్టుగా.. అక్షింతలు కలపాలి.. తీర్థం పుచ్చుకోవాలి, ప్రసాదం తినాలి, ఊరేగింపులు తీయాలి అన్నట్టుగా బీజేపీ తీరు ఉందని విమర్శించారు. ఈ అక్షింతలు, ఈ పులిహోర, ఈ తీర్థాలు, కాషాయ జెండాల ఊరేగింపులు మన కడుపు నింపుతుందా? అని ప్రశ్నించారు. మన పొలాలకు నీళ్లను తీసుకొస్తుందా అని నిలదీశారు.

ప్రతి బోర్‌కు మీటర్‌ పెట్టాలని.. లేదంటే నిన్ను పడగొడతా, నీ ఎమ్మెల్యేలను కొంటా అన్నట్టుగా మోదీ ప్రభుత్వం వ్యవహరించిందని కేసీఆర్‌ గుర్తు చేశారు. నా తలకాయ తెగిబడ్డాసరే రాష్ట్ర ప్రజలకు కరెంటు కావాలి? మీటర్‌ పెట్టనని స్పష్టం చేశానని చెప్పారు. ‘ ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే ఏమంటారు.. మేం రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పినా కూడా మాకే ఓటేసిండ్రు.. అందుకే తెల్లారి నుంచే మీటర్లు పెడతారు’ అని కేసీఆర్‌ అన్నారు. అందుకే రైతులు ఆలోచించుకోవాలని సూచించారు..

- Advertisement -

మోదీ వచ్చి రాగానే ఏడు మండలాలను తీసుకెళ్లి ఏపీకి ఇచ్చేశారని కేసీఆర్‌ తెలిపారు. 400 మెగావాట్ల సీలేరు ప్రాజెక్టును తీసుకెళ్లి ఆంధ్రాకు అప్పజెప్పారని మండిపడ్డారు. మోదీ లేకుండా, బీజేపీ లేకుండా ఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న తెలంగాణకు బ్రహ్మాండంగా లాభం జరిగేదని అన్నారు. తెలంగాణ భారీగా నష్టపడ్డదే బీజేపీ కేంద్ర ప్రభుత్వం వల్ల అని వ్యాఖ్యానించారు. మళ్లీ సిగ్గులేకుండా ఓట్లు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. ఆనాడు తప్పిపోయి ఓటేస్తే నలుగురు ఎంపీలుగా గెలిచారు. వీళ్లు ఒక్క రూపాయి పనైనా చేశారా? ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తారని విమర్శించారు. ‘ మా వయసు మీరిపోతుంది.. ఈ తెలంగాణ మీది.. భవిష్యత్తు మీది.. ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపేది మీరు.. పార్లమెంటులో ఏం జరుగుతుంది? ఎవరు గెలిస్తే మనకు మేలు జరుగుతుందనేది యువకులు ఆలోచించాలని’ చెప్పారు

తెలంగాణకు 1956 నుంచి ఇప్పటి వరకు మనకు శత్రువే కాంగ్రెస్‌ పార్టీ అని.. ఉన్న తెలంగాణను ఊడగొట్టి ముంచిందే ఈ కాంగ్రెస్‌ పార్టీ అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు విమర్శించారు. ’58 ఏళ్లు గోసపడ్డాం. భోనగిరి, ఆలేరు, జనగామ ప్రాంతం ఎంత గోసల ఉంటుండే. నీళ్ల వ్యాపారం ఉంటుండే. నీళ్లవ్యాపారాలు ఉంటుండే. బిందెలుపట్టుకొని మోసుడు ఉంటుండే. ఎన్ని బాధలు అనుభవించాం. వలసలు పోవడం, పట్నంపోవడం, ఆటోలు నడుపుకోవడం. మన వ్యవసాయాలను మూలకుపెట్టడం. ఇలా అనేక రకాల బాధలుపడ్డాం’ అంటూ గత కాంగ్రెస్‌ పాలనను కేసీఆర్ గుర్తు చేశారు.

‘ఆ నాడు ఎవరూ ధైర్యం చేయకపోయినా.. ఖచ్చితంగా తెలంగాణ లాభం జరగాలి. సొంత రాష్ట్రం కావాలి. బ్రహ్మాండంగా ఉండాలని నేను ఒక్కడినే పిడికెడు మందితో మిమ్మల్ని నమ్ముకొని ఉద్యమం ప్రారంభించాను. 15సంవత్సరాలు నిరాటంకంగా కొట్లాడి, చావునోట్లో తలకాయపెట్టి.. నిమ్స్‌ దవాఖానాలో నేను చచ్చిపోతనో.. బతుకుతనో అనే టైమ్‌ వరకు కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీరంతా పులుల్లా కొట్లాడితే.. ఆ నాడు తలవంచి తెలంగాణ ఇచ్చింది. ఆ తర్వాత మనకు అధికారం వచ్చింది. కులం, మతం, జాతి వివక్ష లేకుండా అన్నివర్గాలకు మేలు జరగాలని చాలామంచి కార్యక్రమాలు చేసుకున్నాం. నేను తెచ్చిన రాష్ట్రంలో నా ప్రజలను తల్లి కోడిలా పిల్లలను కాపాడుకున్నట్లు అందరినీ కాపాడినం’ అన్నారు.

‘రైతులకు సంవత్సరానికి ఎకరానికి రూ.10వేలు ఇచ్చి బ్రహ్మాండంగా రైతుబంధు కార్యక్రమాన్ని భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెచ్చిన గవర్నమెంట్‌ బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్. ఒక సంవత్సరంలోనే చెడిపోయిన కరెంటును మంచిగ చేసి.. 24గంటలు కరెంటు ఇచ్చుకున్నాం. నీళ్లు ఇచ్చుకున్నాం. మన భువనగిరిలో బస్వాపూర్‌ ప్రాజెక్టును పూర్తి చేసుకున్నాం. నీళ్లు మీ అందరికీ వస్తయ్‌. ఆలేరు, భువనగిరి వస్తాయి. వడ్లు బ్రహ్మాండంగా మద్దతు ధర ఇచ్చి ఒక గింజకూడా లేకుండా కొనుగోలు కేంద్రాలు పెట్టి వడ్లు కొన్నాం. కొన్న వడ్ల పైసలు కూడా రైతులకు నేరుగా అకౌంట్లలో వేశాం’ అన్నారు.

‘ఇవాళ కాంగ్రెస్‌ ఏం చేసింది ? అడ్డగోలు హామీలు ఇచ్చింది. కేసీఆర్‌ రూ.10వేలు ఇస్తుండు కదా? మేం రూ.15వేలు ఇస్తాం. కేసీఆర్‌ లక్ష మాఫీ చేసిండు కదా? మేం రెండులక్షలు మాఫీ చేస్తమని చెప్పారా? రైతుబంధు అందరికీ వచ్చిందా ? రాలేదు కదా? అదికూడా ఉంటడో.. ఊడగొడుతరో తెలియడం లేదు. ఐదెకరాలకు, మూడెకరాలకు వేస్తామంటున్నరు నీ యబ్బ జాగీరు పోతుందా? నీ ముల్లె ఏమైనా పోతుందా? రైతులకు ఏమైనా బెంజ్‌ కారులు ఉన్నయా? రైతుల వద్ద ఏమైనా కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయా? ఐదెకరాలకే వేస్తామంటే.. ఆరు ఎకరాలు ఉన్నవారు ఎటుపోవాలి? ‘ అంటూ కేసీఆర్‌ కాంగ్రెస్‌ సర్కారుపై కేసీఆర్‌ మండిపడ్డారు.

రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే కొనే దిక్కలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.’తడిసిపోయేకాడ తడిసిపోతుంది. ధర సరిగా ఇవ్వడం లేదు. మిల్లర్ల కమీషన్లు దొబ్బారు. వాళ్లు కొనడానికి ముందుకురావడం లేదు. ఇలా కొనుగోళ్లను గోల్‌మాల్‌ చేశారు. నాలుగైదు నెలల కింద మంచిగా ఇంట్లో ఉండి కరెంటుపెట్టుకొని.. తెల్లారి పొలం చూసుకున్న రైతులు మళ్లీ పాములు, తేళ్లు కరువంగా రాత్రిపూట మోటార్లు పెట్టే దుర్మార్గ పాలన కాంగ్రెస్‌ తీసుకువచ్చింది. తొమ్మిదేళ్లు కరెంటు ఇచ్చిండు కదా కేసీఆర్‌. కేసీఆర్‌ పక్కకు జరుగంగనే కట్క బంద్‌ చేసినట్లుగా కరెంటు మాయమైతదా? ఈ మాత్రం వీళ్లకు చేతనైతలేదా వీళ్లకు. తొమ్మిదేళ్లు నడ్వనే నడిచే.. తొవ్వ పడనే పడే. పడ్డ తొవ్వలో నడువస్తలేదా? మరి వీళ్లను దద్దమ్మలు అనకపోతే ఏమనాలే?’ అని ప్రశ్నించారు.

‘తెలంగాణలో 2014కు ముందు రైతన్నలు ఆత్మహత్యలు చేసుకునేది. వలసలు పోయేవారు. మొత్తం బంద్‌ అయ్యేలా చేశాం. భగవంతుడి దయతో ఆత్మహత్యలు బందయ్యాయి. సంతోషపడ్డం మంచిగైంది తెలంగాణ అని. కాంగ్రెస్‌ గవర్నమెంట్‌ వచ్చినకాడి నుంచి రాత్రిపూట కరెంటుపెట్ట సచ్చిపోయినోళ్లు.. పొలం ఎండిపోతే గుండె ఆగి చనిపోయినోళ్లు 225 మంది చనిపోయారు. ముఖ్యమంత్రిగారూ పరామర్శించమంటే.. వాళ్ల కుటుంబాలను ఆదుకోమన్నాం. మనం ఉన్నప్పుడు దర్జాగా రైతుబీమా పెట్టాం. ఎవరైనా రైతు చనిపోతే వారంలోగా వాళ్ల ఇంటికి రూ.5లక్షల వచ్చినయ్‌. మీరు వెళ్లి పోయి సముదాయించండి అంటే.. ముఖ్యమంత్రి పోడు. మంత్రులు పోరు. ఎమ్మెల్యేలు పోరు. రైతులంటే మీకు కనిపించడం లేదు. అంత అగ్గువ అయిపోయారా? అంత అధ్వాన్నం అయిపోయారా?’ అంటూ నిలదీశారు.

‘ముఖ్యమంత్రి ఏమంటున్నడు.. 48 గంటల్లో పేర్లు పంపియ్‌.. నిజమే అయితే ఆదుకుంటా అన్నడు. నేను నాలుగు గంటల్లోనే పంపిన. ఫొటోలు, ఫోన్‌ నంబర్లతో సహా పంపాను. ఎవరూ పోలేదు. ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే ఎవరూ పోలేదు పరామర్శించలేదు. రైతులకు ఏం బాధ ఇది. నా రైతులకు ఈ బాధ. నేను మంచిగ చేసుకున్న తెలంగాణ. పంటలు మంచిగ పండిన తెలంగాణ ఎందుకు నాశనం కావాలి. ఇప్పుడు నా కండ్ల ముందటే ఎండిపోతే.. యుద్ధం చేయాలా? మరి ఏం చేయాలి? అందరి కలిసి పోరాడుదామా?’ అని ప్రశ్నించగా.. పోరాడుదాం అంటూ జనం నినదించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement