హైదరాబాద్,ఆంధ్రప్రభ: తెలంగాణలో అశ్వయుజ మాస శుద్ధ పాడ్యమినుంచి తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేబతుకమ్మ పండుగ నేటినుంచి ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబురాల ఏర్పాట్లలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిమగ్నమైంది. మహాలయ అమాస్య నుంచి దుర్గాష్టమి వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జరుపుకునే ఈ పూలపండుగకు అత్యంత ప్రాధాన్యత ఉంది.
అందుబాటులో ఉన్న చరిత్ర మేరకు కాకతీయ సామ్రాజ్యంలో పద్మాక్షి ఆలయం దగ్గర బతుకమ్మ వేడుకలను రాణీ రుద్రమదేవి ఘనంగా నిర్వహించడంతో పాటుగా పండుగ సంబరాల్లో పాల్గొనే వారు. నేటికి ఆలయందగ్గర బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినఅనంతరం సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రకటించి అంతర్జాతీయ ఈ పండుగకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండుగకు రోజుకో పేరుతో నిర్వహిస్తారు.
మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నాన బియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బియ్యం బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ, చివరి రోజు అశ్వయుజ అష్టమి నాడు సద్దుల బతుకమ్మగా పులుస్తూ అత్యంత వైభవంగా తెలంగాణ మహిళలు సంబరాలు జరుపుకుంటారు.
పుడమి పులకింత, ప్రకృతి పరవశం లీనమై అగుపించే ఈ పండుగ ఏర్పాట్లలో రాష్ట్ర సాంస్కృతిక శాఖనిమగ్నమైంది. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతి రోజు వెడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అధికారులు నిర్వహణలో నిమగ్నమయ్యారు.
అయితే ఎన్నిక కోడ్ అమల్లో ఉండటంతో బతుకమ్మ పండుగకు సంబంధించిన కార్యక్రమాల నిర్వహణకు అనుమతి అవసరమని అధికారులు చెప్పారు. ఎన్నికల కమిషన్ అనుమతి మేరకు సాస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ప్రజలు ఆనందంతో స్వతహాగా చేసుకునే పండుగకు ఎన్నికల కోడ్ కు సంబంధం లేదని అధికారులు చెప్పారు.