హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాల (శుక్రవారం) జారీ అయ్యింది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. పోలింగ్ ప్రక్రియ మొత్తం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) ద్వారానే నిర్వహించనున్నారు.
ఇంటి వద్ద ఓటు వేసే వారి కోసం తయారు చేసిన పోస్టల్ బ్యాలెట్, బ్యాలెట్ పేపర్ గులాబీ (పింక్) రంగులో ఉంటాయి. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లను ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలి మరియు దరఖాస్తును భౌతికంగా రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి.
రాష్ట్రంలోనే తొలిసారిగా వికలాంగులు, 80 ఏళ్లు పైబడిన వారందరికీ ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించింది. అయితే ఇంటి వద్దే ఓటు వేయాలనుకునేవారు ఈ నెల 7వ తేదీలోగా బూత్ లెవల్ అధికారి(బీఎల్‌వో)కి ’12డీ’ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వారికి మాత్రమే ఈ సౌకర్యం ఉంది.
వీరితో పాటు అత్యవసర సేవలు అందిస్తున్న 13 శాఖల సిబ్బంది, ఉద్యోగులు, అధికారులకు పోస్టల్ ఓటింగ్ సౌకర్యం కల్పించారు. ఆయా శాఖల నోడల్ అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వీరితో పాటు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, అధికారులు, సిబ్బందికి కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు.
అయితే గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులందరికీ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడంతో వారంతా అక్కడే ఓటు వేయాల్సి ఉంటుంది. ఈసారి 13 లక్షల మందికి పైగా పోస్టల్ ఓటు హక్కును వినియోగించుకుని ఇంటి వద్దే ఓటు వేసేందుకు అర్హులుగా గుర్తించామని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.