అమెరికా అధికార పీఠాన్ని రెండోసారి దక్కించుకోవాలని కలల కంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలు కేసుల్లో నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనకు తాజాగా న్యూయార్క్ కోర్టు మరో గట్టి షాకిచ్చింది. పలు బ్యాంకులను మోసం చేసిన కేసులో 364 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.3వేల కోట్లకు పైమాటే) పెనాల్టీ విధించింది.
ట్రంప్ తన ఆస్తుల మొత్తాన్ని వాస్తవిక విలువ కంటే అధికంగా చూపి బ్యాంకులను, బీమా సంస్థలను మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. కొన్నేళ్ల పాటు ఇలా మోసపూరితంగా వ్యాపార రుణాలు, బీమా పొందారన్న అభియోగాలపై కేసు నమోదైంది. న్యూయార్క్ అటార్నీ జనరల్, డెమోక్రాట్ నేత లెటిటియా జేమ్స్ ఈ దావా వేయగా.. దీనిపై ఇటీవల రెండున్నర నెలల పాటు న్యాయస్థానం విచారణ జరిపింది.
ఇందులో ట్రంప్‌పై అభియోగాలు రుజువవడంతో 365 మిలియన్ డాలర్ల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. అంతేగాక, మూడేళ్ల పాటు న్యూయార్క్‌కు చెందిన ఏ సంస్థలోనూ ఆయన ఆఫీసర్ లేదా డైరెక్టర్‌గా ఉండకూడదంటూ నిషేధం విధించారు. ఇది సివిల్ కేసు కావడంతో జైలు శిక్ష వేయట్లేదని తెలిపారు. ఈ తీర్పుపై తాము అప్పీల్‌కు వెళ్తామని ట్రంప్ తరఫు న్యాయవాదులు వెల్లడించారు.