కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. అనేక కుటుంబాలకు ప్రాణదాతగా మారారు. కరోనా తొలిదశ తీవ్రంగా ఉన్న సమయంలోనే వేలాదిమందికి తన సామాజిక మాధ్యమ ఎకౌంట్ల ద్వారా సాయంచేసిన కవిత.. ఇపుడు సెకండ్ వేవ్ కలవరపడుతున్న వేళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు, నిజామాబాద్ లోక్‌సభ పరిధిలోని నియోజకవర్గాల ప్రజలకు ఆపద్భాంధవురాలిగా మారారు. ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటుచేసి ప్రజల నుండి కరోనా ఆపత్కాలంలో సాయం కోసం వ్యక్తమవుతున్న విజ్ఞప్తులను ఆమె పరిశీలించి పరిష్కరిస్తున్నారు. మందులకొరత, బెడ్లకొరత వంటి ఎన్నో సమస్యలు పరిష్కరించడంతో పాటు సకాలంలో ఆస్పత్రులకు చేర్చేందుకు, నిజామాబాద్ నుండి హైదరాబాద్ ఆస్పత్రులకు తరలించేందుకు అవసరమైన అంబులెన్స్‌లు ఏర్పాటుచేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ ఫలితంగా మెట్‌పల్లి, కోరుట్ల, నిజామాబాద్ ప్రాంతాలకు మరిన్ని అంబులెన్స్‌లు, కరోనా టెస్టింగ్ కిట్‌లు అందుబాటులోకి వచ్చాయి. కోరుట్ల, మెట్‌పల్లి ఆసుపత్రుల్లో కొత్తగా 7500 కరోనా టెస్టింగ్ కిట్‌లు అందుబాటులోకి రానుండగా, గురువారం నుండి సిరికొండ మండలంలో అంబులెన్స్ సేవలు ప్రారంభమయ్యాయి. కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాల్లో పరీక్షలు చేయించుకునేందుకు తగినన్ని కిట్ లేవని, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పలువురు ట్విట్టర్ ద్వారా ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకొచ్చారు.
దీనిపై వెంటనే స్పందించిన కవిత వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, జగిత్యాల కలెక్టర్లను ట్విట్టర్‌లో ట్యాగ్ చేస్తూ సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరారు. మంత్రి ఈటల రాజేందర్, కరోనా కిట్‌ల విషయాన్ని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో గురువారం నుంచి కొత్తగా 7,500 కరోనా టెస్టింగ్ కిట్‌లు కోరుట్ల, మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఓవైపు కవిత తండ్రి ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారినపడగా, ఆ ఆందోళన మనసులో ఉన్నా.. ప్రజల కోసం కవిత పరితపించడం, అక్కా అంటూ సాయం కోరిన వారికి నేనున్నానంటూ భరోసానివ్వడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతీరోజూ సాయంత్రం ప్రజల నుండి ఆరోజు ఏమేం విజ్ఞప్తులు వచ్చాయో.. పరిశీలించి మరుసటిరోజు ఆ సమస్యలు పరిష్కారమయ్యేలా చొరవతీసుకుంటుండడం కవిత నిబద్దతకు అద్దంపడుతోంది.
తక్షణమే అంబులెన్స్
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో అంబులెన్స్‌ల కొరత ఉందని, స్థానిక ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ కవితతో ప్రస్తావించారు. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత సరికొండ మండలానికి అంబులెన్స్ మంజూరు చేయించారు. దీంతో ప్రజలు, స్థానిక నాయకులు, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక్క వైద్యసాయమే కాకుండా.. దివ్యాంగులకు స్కూటీలు, జీవనోపాధి పొందేందుకు.. ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు అవసరమైన సాయం అందిస్తూ కవిత ఎంతోమందికి వెలుగుగా మారారు.
……..