టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణం కోసం కార్యాచరణను రూపొందించినట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు సెప్టెంబర్ 2వ తేదీన 12,769 గ్రామ పంచాయతీల్లో, 142 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ జెండా పండుగ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జెండా పండుగతో పాటు గ్రామ కమిటీలు, వార్డు కమిటీల నిర్మాణం చేయాలని సూచించారు. అదే రోజు సీఎం కేసీఆర్ ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొంటారని కేటీఆర్ తెలిపారు.
‘సెప్టెంబర్ 2 నుంచి 12వ తేదీ వరకు గ్రామ, వార్డు కమిటీల ప్రక్రియ నిర్వహించాలి. సెప్టెంబర్ 12 నుంచి 20వ తేదీ లోపు మండల కమిటీలు,పట్టణ కమిటీలు ఏర్పాటు చేయాలి. వీటి తర్వాత ఎమ్మెల్యేలు, ఇంచార్జిలు సమక్షంలో జిల్లా అధ్యక్షుడు, కార్యవర్గం ఎంపిక ఉంటుంది. సెప్టెంబర్ 20 తర్వాత రాష్ట్ర కార్యవర్గం ఎంపిక జరుగుతుంది. ఈ కమిటీలన్నీ సెప్టెంబర్ చివరి వరకు పూర్తవుతాయి. హైదరాబాద్‌లో బస్తీ కమిటీలు, డివిజన్ కమిటీలు ఏర్పాటు చేస్తాం. పార్టీ యొక్క నియామవళి ప్రకారం.. క్రియాశీల సభ్యులను ఎంపిక చేస్తారు. 51 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటు మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తాం. సోషల్ మీడియాకు సంబంధించి కమిటీలు వేయాలని నిర్ణయించాం. మండల, పట్టణ, నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేస్తాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.