Tuesday, November 26, 2024

కులాలవారిగా జన గణన చేపట్టాలి : టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ డిమాండ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా కులాలవారిగా జనగణన చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రాజ్యాంగం (షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు) ఆదేశాలు (2వ సవరణ) బిల్లుపై చర్చలో భాగంగా మాట్లాడిన ఆయన, తెలంగాణ రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను 6% నుంచి 10 శాతానికి పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఉన్న దళిత, గిరిజనుల జనాభా గణాంకాల ఆధారంగా రిజర్వేషన్లను పెంచాలంటూ తెలంగాణ రాష్ట్రం కేంద్రాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. అలాగే కొన్ని కులాలను ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చే అంశం కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద చాలా కాలంగా పెండింగులో ఉందని గుర్తుచేశారు.

మరోవైపు జనాభాలో ఏ కులానికి చెందినవారు ఎంతమంది ఉన్నారో తెలిస్తే, అందుకు తగ్గట్టుగా ఆయా కులాల అభ్యున్నతి కోసం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తీసుకురావొచ్చని, ఇందుకోసం కులాలవారిగా జనగణన చేపట్టాల్సిందేనని ఎంపీ బీబీ పాటిల్ కేంద్రాన్ని కోరారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం ఆర్థికంగా చేయూతనివ్వాలని కూడా కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని త్వరగా నెలకొల్పాలని, అలాగే ఏకలవ్య పాఠశాలలను సైతం ఏర్పాటు చేయాలని బీబీ పాటిల్ విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నట్టే సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని తెలంగాణ రాష్ట్రంలోనూ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పాటిల్ కోరారు.

మద్నూర్ – బోధన్ రహదారిని భారత్‌మాలలో చేర్చండి

మద్నూర్ నుంచి బోధన్ 38.70 కి.మీ మేర ఉన్న నేషనల్ హైవే 161 (బీబీ) రహదారిని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోకి తీసుకొచ్చి, నాలుగేళ్లుగా ఎలాంటి అభివృద్ధి చేపట్టకుండా వదిలేశారని టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. రూల్ 377 ప్రకారం శుక్రవారం లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తిన పాటిల్, ఈ రహదారి నేషనల్ హైవే 161ను, నేషనల్ హైవే 44 నాగ్‌పూర్ హైవేను అనుసంధానం చేస్తుందని తెలిపారు. ఈ కారణంగా ఈ రహదారిపై వాహనాల రద్దీ తీవ్రంగా ఉంటుందని అన్నారు. కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలను కలిపే కీలకమైన రహదారుల్లో ఇదొకటని గుర్తుచేశారు. దీన్ని ఒక శాఖ నుంచి మరో శాఖ పరిధిలోకి మార్చకుండా, భారత్‌మాల పరిధిలోకి తీసుకొచ్చి 4 వరుసల రహదారిగా అభివృద్ధి చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement