Thursday, November 21, 2024

ఇది వాణిదేవి ప్రస్థానం

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టబద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్ధి సురభి వాణిదేవి విజయం సాధించారు. తమ సమీప బీజేపీ అభ్యర్ధి రామచంద్రరావు పైన విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో ఆమె విజయం సాధించారు. దీనితో బీజేపీ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. వాణిదేవి విజయంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జ‌రిపాయి. పీవీ కుమార్తె నుంచి ఎమ్మెల్సీ వరకు వాణిదేవి ప్రస్థానం ఒక్కసారి చూద్దాం!వాణిదేవి భారతదేశ మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహారావు దంపతులకు 1952, ఏప్రిల్ 1న తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని వంగర గ్రామంలో జన్మించారు. హైదరాబాదు హైదర్‌గూడలోని ప్రభుత్వ బాలికల పాఠశాల నుండి హెచ్ఎస్సి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బీఏ డిగ్రీ, జెఎన్‌టియు నుండి ఫైన్ ఆర్ట్స్‌లో డిప్లొమా పూర్తిచేశారు. ఇక 1990 నుండి 1995 మధ్య జెఎన్‌టియులో లెక్చరర్‌గా పనిచేశారు. గత మూడు దశాబ్దాలుగా విద్యారంగంలో విశేషమైన కృషి చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వంటి విద్యాసంస్థలను స్థాపించారు. అంతేకాకుండా చిత్రకారిణిగా 1973 నుండి దేశవిదేశాల్లో 15కి పైగా సోలో ఎగ్జిబిషన్లు, అనేక గ్రూప్ షోలు, సెమినార్లు నిర్వహించారు. సామాజిక కార్యకర్తగా స్వామి రామానంద తీర్థ స్మారక కమిటీ ప్రధాన కార్యదర్శి లాంటి పలు పదవులను నిర్వహించారు . ఆమె సేవలకి గాను 2016లో ఇంటర్నేషనల్ విమెన్స్ అచీవ్‌మెంట్ అవార్డు, 2017లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారాలు దక్కాయి.పీవీ నరసింహారావు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే, ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత పీవీ శతజయంతి ఉత్సవాలను భారీ ఎత్తున నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. 2020 జూన్ 28 నుంచి 2021 జూన్ 28 వరకు ఏడాది పాటు పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తోంది. అందుకోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కే.కేశవరావు చైర్మన్‌గా ఉండగా, మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్ రావు, పీవీ కుమార్తె సురభి వాణిదేవి కూడా సభ్యులుగా ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. సురభి వాణిదేవిని టీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు చేశారు. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా వాణీదేవి ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావుపై వాణీదేవి గెలుపొందారు. వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓట్లు 1,12,689 పోలవ్వగా రెండో ప్రాధాన్యతగా 36,580 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1,49,269 ఓట్లతో వాణీదేవి విజయఢంకా మోగించారు. బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకి 1,19,198 ఓట్లు వచ్చాయి. రామచందర్‌రావు ఓటమితో బీజేపీ సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోయింది.

TRS MLC VANI DEVI BIOGRAPHY

Advertisement

తాజా వార్తలు

Advertisement