Tuesday, November 26, 2024

ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసిన టీఆర్‌ఎస్.. పారదర్శకంగా జరగాల్సిన ఎన్నిక పక్షపాతంగా మారిందన్న కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మునుగోడు ఉపఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిని ప్రజాస్వామ్యాన్ని మరోసారి పరిహాసం చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అంగబలం, అర్థబలంతో పాటు పోలీసులు, ఇతర అధికారులను తమ గెలుపు కోసం విచ్చలవిడిగా వినియోగించుకుందని ఆరోపించారు. ఈమేరకు గురువారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలకు 36 గంటల ముందు స్థానికేతరులు మునుగోడు నియోజకవర్గాన్ని ఖాళీ చేసి పోవాలన్న నిబంధనను కూడా టీఆర్ఎస్ పార్టీ యథేచ్చగా గాలికొదిలేసిందన్న కిషన్ రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు మాత్రం ఎన్నికకు ముందు రెండు రాత్రులు అధికారులు, పోలీసుల అండదండలతో గ్రామాల్లో తిరుగుతూ డబ్బులు పంచారని, ప్రశ్నించిన వారిపై దాడులకు చేస్తూ అరాచకాలకు పాల్పడటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పారదర్శకంగా జరగాల్సిన ఎన్నిక పక్షపాతంగా మారిందని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ తీరును, అధికారులు, పోలీసుల వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.

నవభారత స్ఫూర్తి ప్రదాత ఛత్రపతి శివాజీ

ఛత్రపతి శివాజీ పాలనలో ఆచరించి చూపిన అంశాలే నేటి నవభారత నిర్మాణానికి మార్గదర్శనం చేస్తున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. శివాజీ రాజ్యంలో కనిపించిన సుపరిపాలన (గుడ్ గవర్నెన్స్), మహిళాసాధికారత, స్థానిక తయారీ ఉత్పత్తులకు ప్రోత్సాహాన్ని అందించడం (వోకల్ ఫర్ లోకల్), అన్ని వర్గాలకు సరైన ప్రాధాన్యత కల్పించడం (సబ్ కా సాథ్, సబ్ కా వికాస్), వినూత్నమైన యుద్ధ తంత్రాలు వంటివన్నీ మోదీ ప్రభుత్వం ద్వారా మరోసారి భారతదేశానికి సరైన గౌరవాన్ని కల్పిస్తున్నాయని చెప్పారు. గురువారం ఢిల్లీలోని ఎర్రకోటలో ఏర్పాటు చేసిన ‘ రాజా శివ్ ఛత్రపతి ఐతిహాసిక్ మహానాట్య్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోదీ ఎర్రకోట నుంచి పంద్రాగస్టు నాడు ఇచ్చిన ‘పంచ్ ప్రణ్’లోని అంశాలకు శివాజీ జీవిత చరిత్ర ఆధారమని, మనలోని బానిస ఆలోచనలను తీసేసినపుడే అభివృద్ధి చెందిన భారత నిర్మాణానికి బాటలు పడతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్న ప్రధాని వ్యాఖ్యలను ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ప్రస్తావించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement