నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఏప్రిల్ 17న జరిగే ఉప ఎన్నిక కోసం అన్ని పార్టీలు ముమ్మరంగా కసరత్తు చేపట్టాయి. ఇందులో భాగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. శనివారం నాడు సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి విమర్శలు చేయగా.. ఆదివారం నాడు జానారెడ్డిపై ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని విమర్శించారు. దేశంలో, తెలంగాణలో ఆ పార్టీ తుడుచు పెట్టుకుపోయిందన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఓటమి ఎదురవుతుందన్న భయంతో జానారెడ్డికి వెన్నులో వణుకుపుడుతోందని విమర్శించారు. నిన్న జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన ఓటమిని ముందే ఒప్పుకున్నట్లుగా ఉన్నాయన్నారు. ఆయన ఎన్నడూ సామాన్య ప్రజలను పట్టించుకోలేదని బాల్క సుమన్ ఆరోపించారు.
అటు జానారెడ్డి వ్యాఖ్యలకు రామగుండం ఎమ్మెల్యే, సాగర్ ఉపఎన్నిక టీఆర్ఎస్ ఇంఛార్జి కోరుకంటి చందర్ కూడా కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వంపై జానారెడ్డి చేస్తున్న దుష్ప్రచారం వల్లే తాము గడప గడపకు గులాబీ సైన్యం పేరుతో ఇంటింటి ప్రచారం చేపట్టామని వివరించారు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాల వల్ల సాగర్ నియోజకవర్గంలో 1.53 లక్షల మంది ప్రజలు లబ్ధి పొందారని.. దీనికి జానారెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాల కారణంగానే 2018 ఎన్నికల్లో జానారెడ్డి ఓడిపోయారని గుర్తుచేశారు. జానారెడ్డి ఎన్ని ఎత్తులు వేసినా టీఆర్ఎస్ చేతిలో చిత్తు కావడం ఖాయమని కోరుకంటి చందర్ హెచ్చరించారు.