హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మార్పుపై ఆ పార్టీ బహిరంగ ప్రకటన జారీ చేసింది. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పేరిట ఈ ప్రకటన జారీ అయింది. పార్టీ కొత్త పేరుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే పంపాలని అందులో సూచించారు. అభ్యంతరాలను 30 రోజుల్లోపు కేంద్ర ఎన్నిక ల సంఘానికి పంపాలని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం… ఇప్పటికే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి పేరు మార్పు, ఇతరత్రా సవరణలు ఉంటే వాటిపై అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంటుంది.
దీనికోసం స్థానిక పత్రికలతోపాటు ఆంగ్ల పత్రికల్లోనూ సదరు పార్టీ ప్రకటనలు ఇవ్వాలి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం నిబందనల మేరకు ఈసీ ప్రకటన జారీ చేసింది. కాగా.. గుజరాత్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పేరుతో పోటీ చేసే అవకాశం ఆ పార్టీకి లేనట్టేనని తెలుస్తోంది. టీఆర్‌ఎస్ పేరు మార్చేందుకు మరో నెల సమయం పట్టే అవకాశం ఉంది.