హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై కేంద్ర ఆహార, పౌర సరఫరాలశాఖ మంత్రి పీయూష్ గోయల్ నిప్పులు చెరిగారు. తెరాస సర్కార్ ఒక విఫల ప్రభుత్వమంటూ ధ్వజమెత్తారు. తెలంగాణలో జరిగిన ధాన్యం సేకరణ అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఆడిట్ బృందాలను పంపించి తనిఖీలు నిర్వహిస్తుందని గోయల్ బుధవారం రాష్ట్రానికి చెందిన కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం, బియ్యాన్ని సేకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. పేదలకు సహకారం అందించడంలో తమ ప్రభుత్వం ఎంతో తాపత్రయ పడుతోందని, పేదలకు ఉన్న హక్కు ప్రకారం వారికి ఆహార ధాన్యాలను అందించే బాధ్యత మోడీ ప్రభుత్వానిదని చెప్పారు.
భారత ఆహార సంస్థ నిబంధనలకు లోబడి తెలంగాణలో ధాన్యాన్ని సేకరిస్తున్నామని అయితే తెలంగాణ ప్రభుత్వం ఎఫ్‌సీఐ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. జాతీయ స్థాయిలో 80 కోట్ల మందికి అదనంగా ఐదు కిలోల బియ్యాన్ని అందించాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. పేదలకు తెరాస ప్రభుత్వం దారుణమైన అన్యాయం చేసిందని విరుచుకుపడ్డారు. ఇంత అన్యాయం చేసిన ప్రభుత్వాలు మరెక్కడా ఉండవని ఆరోపించారు. తెలంగాణ సీఎం, మంత్రులు ఇష్టారాజ్యంగా నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. వారు తననుద్దేశించి అత్యంత అసభ్యంగా మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తనపై, కేంద్ర ప్రభుత్వంపై అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలు చేస్తూ దుర్భాషలాడుతున్నారని మండిపడ్డారు.
పక్కా రాజకీయ ఎజెండాను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేస్తోందని మండిపడ్డారు. దేశంలోని ప్రతి పేదవాడికి ఆహార ధాన్యాలను అందించాలన్నది కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. దేశంలో పేదలు అర్ధాకలితో అలమటిస్తున్నారని అటువంటి వారికి తమ ప్రభుత్వం అండగా ఉండి ఆహార ధాన్యాలను ఇస్తోందని చెప్పారు. ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని ఈ అంశంపై కేంద్రానికి ఫిర్యాదులు కూడా అందాయని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. త్వరలోనే తమ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఆడిట్ బృందాలను తెలంగాణకు పంపించి తనిఖీలు నిర్వహిస్తామని ఇప్పటికే ఈ అంశంపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని ఆయన పేర్కొన్నారు.