జూలపల్లి, (ప్రభన్యూస్): తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కుర్మల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో గొల్లకుర్మలకు గొర్రెలు, మేకలు పెంచుకునే స్థలాలకు సంబంధించి 127 మంది లబ్ధిదారులకు వారి పేరుపై చేసిన పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ ప్రభుత్వం గొల్ల కుర్మల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారి ఆర్థిక అభివృద్ధికి.. గొర్రెల యూనిట్లను సబ్సిడీ ద్వారా అందించేందుకు సీఎం కేసీఆర్ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ప్రభుత్వ పథకాలను గొల్ల కుర్మలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కాగా, కమ్మర్ ఖాన్ పేట, అబ్బాపూర్, పెరకపల్లి, లంబాడీ తండా, ఆర్నకొండ గ్రామాల గొల్ల, కుర్మ సోదరులు 50 ఏళ్లుగా గొర్రెలు మేకలు పెంచుకొనే స్థలంపై తమకు ఎలాంటి హక్కులు లేవని గత ఏడాది తన దృష్టి తెచ్చారన్నారు. దీంతో వారి సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి 156 సర్వే నెంబరులోని 153 ఎకరాల భూమిని 127 మంది లబ్ధిదారుల పేరు మీద పట్టాలు చేయించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఛైర్మన్ రఘువీర్ సింగ్, జెడ్పీటీ-సీ బొద్దుల లక్ష్మణ్, ఎంపిపి కుస్కుంట్ల రమాదేవితోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.