Saturday, November 23, 2024

మజ్లిస్ మోచేతి నీళ్లు తాగుతున్న టీఆర్‌ఎస్.. తీవ్ర విమర్శలు చేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆదివారం న్యూఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశంలో జాతీయ కమిటీ వేశామని చెప్పారు.

ఆగస్టు 11 న విభజన దినోత్సవం నిర్వహిస్తున్నామని, భారత్-పాక్ విడిపోయిన సందర్భంగా జరిగిన ఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదని కిషన్ ఆకాంక్షించారు. పార్లమెంట్ లైబ్రరీ హాల్‌లో సోమవారం ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని, భవిష్యత్‌లో రాష్ట్రాలలో కూడా ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని చెప్పారు. ఆగస్టు 15న దేశవ్యాప్తంగా అందరిళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని కేంద్రమంత్రి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా అన్ని పంచాయితీలకు,రాష్ట్రాలకు లేఖలు రాశామని, వర్చువల్ సమావేశాలు నిర్వహించామని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు, సాధువులు, పీఠాధిపతులు, కవులు, మేధావులు, విద్యార్థులు హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి మద్దతు తెలిపారని హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 20 కోట్ల గృహాలపై జెండాలు ఎగరనున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు. చేనేత, ఖాదీ జెండాలు తయారు చేయిస్తున్నామన్నారు. అనేక టెక్స్ట్‌టైల్ కంపెనీ, చేనేత కార్మికులు, డ్వాక్రా గ్రూపులకు జెండాలు తయారు చేసే పని అప్పగించామన్నారు. అయినా జెండాల కొరత ఏర్పడిందని ఆయన చెప్పుకొచ్చారు. 13, 14, 15 వ తేదీల్లో అందరిళ్లపై జెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చారు. జెండా లేకపోయినా తెల్ల పేపర్ మీద జెండాలను ముద్రించి గోడల మీద అంటించే ప్రయత్నం చేయాలన్నారు. తెలుగు బిడ్డ అయిన పింగళి వెంకయ్య రూపొందించిన జెండా పండుగ ప్రపంచవ్యాప్తంగా జరగడం ఆనందదదాయకమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ తమకు తోచిన రీతిలో జెండా పండుగ నిర్వహించాలని కిషన్ రెడ్డి కోరారు. కనీసం కంప్యూటర్‌లో ప్రింట్ తీసుకునైనా మీ ఇంటి ముందు జెండా పెట్టండని విజ్ఞప్తి చేశారు. జెండా పండుగలో పాల్గొని జాతీయవాదాన్ని చాటి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ వందేళ్ల స్వాతంత్ర్య దినోత్సవం నాటికి విశ్వ గురువుగా ఉండాలని కిషన్ ఆకాంక్షించారు.

కల్వకుంట్ల కుటుంబం గుప్పిట్లో తెలంగాణ..

అనంతరం ఆయన కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాకపోవడంపై స్పందించారు. దేశాభివృధ్ధి కోసం చర్చించే అద్భుత వేదిక నీతి ఆయోగ్ మీటింగ్ అని అభివర్ణించారు. ప్రధానిని కలవటం ఇష్టం లేకపోతే ఫామ్ హౌజ్‌లోనో, ప్రగతి భవన్‌లోనో ఉండండని ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణ పేరు చెప్పి ఏ రకమైన పరిపాలన చేస్తున్నారో అందరూ గమనిస్తున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడేంత వరకు కేంద్ర ప్రభుత్వం మంచిదన్నారు, బీజేపీ బలపడ్డాక వారి కుటుంబం అధికారం కోల్పోతుందనే బాధతో మోదీపై, కేంద్ర ప్రభుత్వంపై విషం ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. దళిత ముఖ్యమంత్రి మాటేంటి? ప్రజలకు ఇచ్చిన హామీల సంగతేంటని ఆయన ప్రశ్నించారు. కేంద్రం ఇళ్ల నిర్మాణం కోసం ఓపెన్ ఆఫర్ పెడితే గులాబీ కండువా కట్టుకున్న వారికే గృహాలు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. 15 మంత్రిత్వ శాఖలు కల్వకుంట్ల కుటుంబం గుప్పిట్లో ఉన్నాయంటే తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా అని కిషన్ రెడ్డి నిలదీశారు. పెట్రోల్, డీజిల్ ధరలు తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయన్న ఆయన, 37 శాతం పెట్రోల్ మీద, 27 శాతం డీజిల్ మీద పన్ను వేస్తున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణలో పలు ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రికి గౌరవంగా పలు లేఖలు రాశానని గుర్తు చేశారు. సైన్స్ సిటీ కోసం 25 ఎకరాలు ఇవ్వాలని రాసిన లేఖపై ఇంతవరకూ స్పందన లేదన్నారు. కొమురం భీం జిల్లాలో ట్రైబల్ మ్యూజియం కోసం డీపీఆర్ కోరామని, కోటి రూపాయలు తెలంగాణా అకౌంట్‌కు పంపామని తెలిపారు. వరంగల్ లో సైనిక్ స్కూల్ మంజూరు చేశామని, రైల్వే టెర్మినల్‌కు ల్యాండ్ అడిగితే ఇవ్వట్లేదని కిషన్ రెడ్డి అన్నారు.

మజ్లిస్‌కు భయపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం..

- Advertisement -

తెలంగాణ లో సెప్టెంబర్ 17 ఉత్సవాలు ఎందుకు జరపడం లేదన్న ఆయన, మజ్లిస్ మోచేతి నీళ్లు తాగి భయపడుతున్నారా అని టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణలో ఎస్సీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌‌లు అందకుండా అడ్డుకుంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు కేంద్ర సంక్షేమ పథకాలు అందటంలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రజల దృష్టి మరల్చటం కోసం కేసీఆర్ అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. జీఎస్టీది ఇండియాలో సక్సెస్ స్టోరీ అని హర్షం వ్యక్తం చేశారు. తమకు కేసీఆర్ కుటుంబ పాలనపై తప్ప తెలంగాణపై వ్యతిరేకత లేదని ఆయన స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement