న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే టీఆర్‌ఎస్, కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతాయని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి జోస్యం చెప్పారు. రెండు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన ఒకే ఒక్కడు తన అన్నకోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తిపై చండూరు సభలో వేదిక మీద బూతులు మాట్లాడించారని రాజగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం పదవులు వదులుకున్న చరిత్ర తమ అన్నదమ్ములదని అన్నారు. సరైన సమయంలో వెంకటరెడ్డి సరైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. టీఆర్ఎస్‌లోకి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళితే ఏ కాంగ్రెస్ నాయకుడూ మాట్లాడలేదన్న ఆయన, తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్తే ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. తన రాజీనామాతో ప్రభుత్వం దిగి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తన రాజీనామా తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతోందని అన్నారు. అధికార కార్యక్రమాలకు సైతం తనను పిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో సొంత డబ్బుతో 50 వేల కుటుంబాలను ఆదుకున్నానని గుర్తు చేశారు. కాంగ్రెస్‌లో అవమానాలు భరించలేక బయటకు వచ్చానని స్పష్టం చేశారు. రేవంత్ డబ్బులతో పీసీసీ చీఫ్ పదవి కొనుక్కున్నారని రాజగోపాల్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పాత్ర లేని వ్యక్తి రేవంత్ అని దుయ్యబట్టారు. తమను కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదన్న ఆయన, బీజేపీ పెద్దలు మాత్రం పిలిచి మాట్లాడారని వివరించారు. తన రాజీనామా ఆమోదించకపోతే స్పీకర్ ఇంటి ముందు కూర్చుంటానని రాజగోపాల్ హెచ్చరించారు. దాసోజు శ్రవణ్ సహా కేసీఆర్, కాంగ్రెస్‌లో అవమానాలకు గురైన నాయకులు బీజేపీలో చేరతారని అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ వెళ్ళిపోతే తాను సీఎం అయ్యే కల నెరవేరదని రేవంత్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
బండి సంజయ్‌తో భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న బండి సంజయ్‌తో రాజగోపాల్‌రెడ్డి సమావేశమయ్యారు. బీజేపీలో చేరిక, చండూరు సభ, మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర తదితర అంశాలపై వారిద్దరూ చర్చించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.