20వేల మంది ఇన్ ఛార్జిలు…
ప్రతి 50 మంది ఓటర్లకు ఒకరు
హైదరాబాద్, : పట్టభద్ర ఎన్నికలపై టీఆర్ఎస్ పక్కాప్లాన్‌తో దూసుకుపోతోంది. ప్రతి 50మంది ఓటర్లకు ఒక ఇన్‌ఛార్జిని నియమించుకుని.. పకడ్బందీగా ప్రచార వ్యూహాన్ని రూపొందించింది. నల్లగొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గంలో.. 5లక్షల మంది ఓటర్లుండగా.. 50మందికి ఒక ఇన్‌ఛార్జి చొప్పున నియోజకవర్గాల వారీగా జాబితాలు రూపొం దించుకుని, ముందుగానే పదివేలమంది ఇన్‌ఛార్జి సైన్యాన్ని తయారు చేసుకుని ఎప్పటికపుడు ప్రచారాన్ని పర్యవేక్షిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు దిశానిర్దేశానికి అనుగుణంగా సిట్టింగ్ ఎమ్మెల్సీ, పార్టీ అభ్యర్ధి డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల సహ కారంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. మూడు జిల్లాల్లో ఉన్న విస్తృత సంబంధాలు, అందుబాటులో ఉండి.. అందించిన సేవలు, పార్టీ క్యాడర్ ప్రతిష్టా త్మకంగా తీసుకోవడం కలిసొచ్చే అంశాలుగా చెబుతున్నారు. అభ్యర్ధిత్వం ప్రకటన ఆలస్యమైనా ప్రచారంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ టీఆర్ఎస్ అభ్యర్ధి సురభి వాణిదేవి ప్రచారంలో దూసుకుపోతోంది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె కావడం, విద్యాసంస్థల నిర్వాహకురాలిగా ఉన్న పరిచ యాలు, టీఆర్ఎస్ క్యాడర్ ఓటింగ్ నమోదులో చురుకుగా పాల్గొనడం వంటి అంశాలు.. కలిసొస్తాయని, రెండు స్ధానాల్లో టీఆర్ఎస్ బంపర్ విక్టరీ సాధిస్తుందని గులాబీ శ్రేణులు ధీమాగా చెబుతున్నారు. ఈనెల 27న మూడు జిల్లాల్లోని 43 నియోజకవర్గాల్లో.. ఒకేసారి నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశాలు నిర్వహించాలని నిర్ణయిం చింది. సమావేశ అనంతరం ఎమ్మెల్యేలు, నేతలు మరింత జోరుగా క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని పరుగెత్తించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోనూ నల్లగొండ వ్యూహాన్నే అమలుచేయాలని పార్టీ నిర్ణయించింది. 50మంది ఓటర్లకో ఇన్‌ఛార్జి వివరాలు.. వెంటనే ఫైనల్ చేసుకుని.. అధిష్టానానికి అందజేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ఆదేశించారు. దీంతో రెండు నియోజకవర్గాల్లో 20వేల మందికి పైగా ఇన్‌ఛార్జిలు గ్రాడ్యుయేట్ ఓటర్లకు కాపుగాయనున్నారు. ఓటర్లను అబివృద్ధి వ్యూహంతో.. ఆకట్టుకోనున్నారు. ప్రశ్నించే గొంతుల వల్ల ప్రయోజనం లేదని, పరిష్కరించే గొంతుకలతోటే ప్రజలకు మేలు కలుగుతుందని ప్రచారంలో.. అభ్యర్ధులు ప్రచారం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, నల్లగొండ జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి, ఖమ్మంలో పువ్వాడ అజయ్, నామా నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. హైదరాబాద్ నియోజకవర్గంలో ఈనెల 27న జరిగే సభలను మంత్రులు పర్యవేక్షిస్తున్నారు.