Saturday, November 23, 2024

వరదలతో అతలాకుతలం, ఆదుకోండి.. విభజన హామీలు అమలు చేయండి : కేంద్రానికి వైసీపీ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: గోదావరి నదికి కనివీనీ ఎరుగని రీతిలో సంభవించిన వరదలతో పెద్దఎత్తున ఆస్తి, పంట నష్టం వాటిల్లినందున తక్షణమే సాయం చేసి ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి.విజయసాయి రెడ్డి, లోక్‌‌సభ ఫ్లోర్‌‌లీడర్‌ పీ.వి. మిధున్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆదివారం ఢిల్లీలోని పార్లమెంట్ అనుబంధ భవనంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరై రాష్ట్ర సమస్యలతో పాటు దేశ సమస్యలపై చర్చ జరపాలని కోరారు. అఖిలపక్ష భేటీ అనంతరం ఆంధ్రప్రదేశ్ భవన్ గురజాడ కాన్ఫరెన్స్ హాల్‌లో మీడియా సమావేశం నిర్వహించిన నేతలిద్దరూ ఆకస్మిక వరదల కారణంగా గోదావరి పరీవాహక ప్రాంతంలోని జిల్లాల్లో ఆస్తి, పంట నష్టం వాటిల్లింది.

వందలాది గ్రామాలు నీట మునిగాయని అన్నారు. మరోవైపు రాష్ట్రాలకు ఇస్తున్న జీఎస్టీ నష్టపరిహారాన్ని మరో అయిదేళ్ళపాటు పొడిగించాలని కోరినట్టు తెలిపారు. కోవిడ్‌ కారణంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు తీవ్ర ఒడిదుగులకు లోనైందున జీఎస్టీ పరిహారం చెల్లింపును మరో అయిదేళ్ళపాటు పొడిగించాలని తాము గతంలోనే కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధాని పార్లమెంట్‌లో స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ ఆ హామీ అమలు చేయకుండా బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోందని అన్నారు. ఇదే విషయాన్ని సమావేశంలో మరోమారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి నిధుల విడుదలలో జరుగుతున్న అసాధారణ జాప్యం వలన ప్రాజెక్ట్‌ పనులు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న సొంత నిధులను రీయింబర్స్‌ చేయడంలో కూడా జరుగుతున్న విపరీతమైన జాప్యాన్ని ఈ సందర్భంగా కేంద్రం దృష్టికి తీసుకువచ్చినట్లు విజయసాయి రెడ్డి చెప్పారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కొన్నేళ్ళుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై అనేక దఫాలుగా తమ పార్టీ ఎంపీలు రైల్వే మంత్రిని కలిసినా రైల్వే జోన్‌ ఏర్పాటులో ఎందుకు కాలయాపన జరుగుతోందో చెప్పాలని సమావేశంలో ప్రశ్నించినట్లు చెప్పారు. జాతీయస్థాయిలో దేశం ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రస్తావించినట్టు విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో అమెరికన్‌ డాలర్‌తో రూపాయి మారకం విలువ విపరీతంగా పడిపోవడం ఆందోళనకర పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికన్‌ డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.79.72లకు పడిపోవడంతో ఒకే నెలలో ఏర్పడ్డ 26.18 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ప్రమాద ఘంటికలను మోగిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

జిల్లాకొక మెడికల్ కాలేజీ మంజూరు చేయాలి

రాష్ట్రంలోని ప్రధాన ప్రాజక్టులైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులకు అనుమతులు మంజూరు చేయడంలో, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యానికి కారణాలు వివరించాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 26 జిల్లాల్లో జిల్లాకొక మెడికల్ కాలేజీ, జిల్లా ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి అనమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే ఇప్పటి వరకు దీనిపై స్పందన లేకపోవడాన్ని సమావేశంలో ప్రస్తావించినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా 12 వైద్య కళాశాలల మంజూరు ప్రతిపాదన ఇప్పటికీ పెండింగ్ లోనే ఉందని గుర్తు చేసారు. ఇటీవల ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా అనేక మంది తెలుగు విద్యార్థులు రాష్ట్రానికి తిరిగి రావడం జరిగిందని, చదువు అర్దాంతరంగా ఆగిపోవడంతో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి తక్షణమే ఇతర మెడికల్ కాలేజీలలో చుదువుకోడానికి అనుమతులు ఇవ్వాలని కోరారు.

- Advertisement -

మహిళా బిల్లును ప్రవేశపెట్టాలి..

కోవిడ్ కారణంగా గత మూడు సంవత్సరాలుగా జనాభా లెక్కల సేకరణ జరగలేదు. 2011 జనాభా లెక్కలను మాత్రమే పరిగణలోకి తీసుకోవడంతో ఆంధ్రప్రదేశ్ అనేక విధాలుగా నష్టపోతున్నదని అన్నారు. పౌరసరఫరా, రేషన్ సరఫరా విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. ఇక కోవిడ్ ప్రభావంతో దేశంలో మహిళా ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని మొత్తం జనాభాలో 48% మహిళలున్నా జీడీపీలో వారి భాగస్వామ్యం కేవలం 17%  మాత్రమే ఉందని అన్నారు. చైనాలో మహిళలు ఆ దేశ జీడీపీలో 40% అందించగలుగుతున్నారని గుర్తు చేసారు. కోవిడ్ తరువాత 21 మిలియన్ల మహిళలు ఉద్యోగ, ఉపాధి కోల్సోయారని గుర్తుచేసారు. మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఏపీ ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టాలని, మహిళల హక్కులు కాపాడాలని కోరినట్లు చెప్పారు. మహిళల విద్య, జీవన ప్రమాణాల పెంపు, శిశు సంరక్షణ గురించి చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. అన్‌పార్లమెంటరీ పదాల జాబితాను లోక్‌‌సభ కార్యాలయం అన్ని రాష్ట్రాలకు పంపించడం 1954 నుండి ఆనవాయితీగా కొనసాగుతోందని, పార్లమెంటు సమావేశాలు ప్రారంభించే ముందు ఆయా రాష్ట్రాలకు లోక్‌సభ స్పీకర్ జాబితాను పంపుతుంటారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అఖిలపక్ష సమావేశంలో వివరణ ఇచ్చినట్టు వెల్లడించారు. అదే విధంగా పార్లమెంట్ ప్రాంగణంలో నిరసనలు, ధర్నాలపై ఆంక్షలు విధిస్తూ వచ్చిన ఆదేశాలపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఇది కూడా ఆనవాయితీగా వస్తున్నదేనని కేంద్ర మంత్రి చెప్పినట్టు విజయసాయి రెడ్డి వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement