గుంటూరు కారం మూవీ రివ్యూ….
నటీనటులు: మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, జయరాం, మురళి శర్మ, ఈశ్వరి రావు, వెన్నెల కిషోర్ తదితరులు
ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, పీఎస్ వినోద్
సంగీతం: ఎస్ థమన్
నిర్మాత: సూర్యదేవర రాధాకృష్ణ
రచన, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
సంక్రాంతి పండగ సినిమా సంబరాలు మొదలైపోయాయి. ఈరోజు ప్రేక్షకుల ముందుకు మహేష్ బాబు నటించిన హై బడ్జెట్ సినిమా ‘గుంటూరు కారం’ వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు, వీళ్లిద్దరి కలయికలో వచ్చిన మూడో సినిమా ఇది. ఈ సినిమా ఎలా వుందో తెలుసుకుందాం..
కథ: వెంకట రమణ (మహేష్ బాబు) చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరం అవుతాడు. అతడి తండ్రి (జయరాం) ఒక హత్య కేసులో జైలుకు వెళ్తే.. తల్లి (రమ్యకృష్ణ) మరో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. తన తండ్రి సొంతూరు గుంటూరులో మేనత్త మావయ్యల దగ్గర పెరిగిన రమణ.. కుటుంబం నుంచి వారసత్వంగా వచ్చిన మిర్చి వ్యాపారం చేస్తుంటాడు. అలాంటి సమయంలో తల్లి నుంచి రమణకు పిలుపు వస్తుంది. కానీ ఆ పిలుపు ఆమె ఆస్తి నుంచి వాటా లేదు అని సంతకం పెట్టించుకోవడానికి అని తెలుస్తుంది. మరి రమణ సంతకం పెట్టాడా.. ఈ పంచాయతీ ఎక్కడిదాకా వెళ్ళింది.. ఈ తల్లి కొడుకుల బంధం ఏ తీరానికి చేరింది అన్నది మిగతా కథ.
యుద్దనపూడి కీర్తి కిరీటాలకు త్రివిక్రమ్ ట్రీట్
ఈ ‘గుంటూరు కారం’ మెయిన్ కథ యద్దనపూడి సులోచనారాణి ‘కీర్తి కిరీటాలు’ ఆధారంగా తీసుకున్నదే . అయితే ఆ నవల అప్పుడెప్పుడో నాలుగైదు దశాబ్దాల కిందట వచ్చింది కాబట్టి, ఆ కథని ఇప్పుడు నవల్లో ఉన్నట్టు తీస్తే ప్రేక్షకులకి అంతగా ఎక్కదు.. అయితే త్రివిక్రమ్ ఆ కథని కొంచెం ఆధునికంగా తయారు చేసి ‘గుంటూరు కారం’ సినిమాగా మలిచాడు. నవలలో కూడా అమ్మ సెంటిమెంట్ ఉంటుంది, సినిమాలో కూడా అదే ముఖ్యమైన భాగం. ఈ సినిమాలో మహేష్ లో ఒక కొత్త అవతారం చూస్తారు. అతని డాన్సులు, డైలాగ్ డెలివరీ, గుంటూరు యాస, శ్రీలీలని టీజ్ చేసే విధానం, ఇలా అన్నీ కొత్తగా ఉంటాయి.
కారం కంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ..
అయితే అలవాటైన సీన్లనే చూస్తున్నా.. ఎంటర్టైన్మెంట్ డోస్ లో మాత్రం త్రివిక్రమ్ ఏమీ తక్కువ చేయలేదు. మహేష్ ను అభిమానులు కోరుకునే ఎనర్జిటిక్- ఎంటర్టైనింగ్ పాత్రలో చూపించి.. దానికి తన మార్కు వెటకారం.. చమత్కారం జోడించడంతో చాలా సీన్లను ఆ పాత్ర సేవ్ చేసేసింది. అదిరిపోయే లుక్స్.. స్క్రీన్ ప్రెజెన్స్.. టిపికల్ డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో మహేష్ విజయవంతం అయ్యాడు. ముఖ్యంగా ప్రతి మార్గం వరకు మహేష్ షో.. త్రివిక్రమ్ సెన్సాఫ్ హ్యూమర్ బాగానే వర్కౌట్ అయ్యాయి. విధ్వంసం చూపిస్తా అన్న ప్రకాష్ రాజ్ కు.. ఆ పదానికి అర్థం ఏంటో తెలియచెప్పే ఆరంభ సన్నివేశంతో గుంటూరు కారం బాగా టేకాఫ్ అయింది. కథపరంగా అంత ఎంగేజింగ్ గా లేకపోయినా.. మహేష్- శ్రీలీల- వెన్నెల కిషోర్ కాంబినేషన్లో కామెడీ కూడా బాగానే పండించాడు. ఇక హీరో ఎలివేషన్ సీన్లు.. పాటలు.. ఫైట్లు కూడా ఓకే అనిపిస్తాయి
మహేష్ క్యామెడీ టైమింగ్ అదుర్స్…
మహేష్ గత కొన్నేళ్లలో చాలా వరకు కామ్ అండ్ మూడీ క్యారెక్టర్లే చేశాడు. అయితే అభిమానులు మహేష్ నుంచి కోరుకునేది జోష్ ఉన్న పాత్రలు. అతను ఎంత అల్లరి చేస్తే అంత ఎంటర్టైన్మెంట్. స్టేజ్ మీద, బయట పొడి పొడిగా మాట్లాడుతూ బిడియస్తుడిలా కనిపించే మహేష్ ఇతనేనా అనిపించేలా తెర మీద చెలరేగిపోయాడు. మహేష్ తర్వాత నటనలో ఎక్కువ మార్కులు పడేది ప్రకాష్ రాజ్ కే. వయసు మళ్ళిన పాత్రలో ఆయన తను చేసే రొటీన్ క్యారెక్టర్ల నుంచి వైవిధ్యం చూపించాడు. రమ్యకృష్ణ ఎక్కువగా మాట్లాడకుండా కళ్ళతోనే నటించింది. రావు రమేష్ చివర్లో వచ్చే ఒక్క సీన్లో తన ప్రత్యేకత చాటుకున్నారు. హీరోయిన్ శ్రీలీల క్యూట్ అనిపిస్తుంది కానీ.. మహేష్ పక్కన చిన్న పిల్లలా అనిపించి.. అంతగా సూట్ కాలేదు. తన డ్యాన్సులు మాత్రం సూపర్. మీనాక్షి పేరుకే రెండో హీరోయిన్. ఆమెకి ఏమాత్రం ప్రాధాన్యం లేని చిన్న సహాయ పాత్ర ఇచ్చారంతే.
తమన్ సినిమాకు సూటయ్యే పాటలు, స్కోర్ ఇచ్చాడు. మనోజ్ పరమహంస కెమెరా పనితనం బాగా సాగింది. విజువల్ గా సినిమా రిచ్ గా కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. ఒక్కటి మాత్రం నిజం త్రివిక్రమ్ మార్క్ సినిమా మాత్రం…సూపర్ స్టార్ మహేష్ మాస్ సినిమా ఇది…సంక్రాంతికి ఓసారి లుక్ వేయవచ్చు..